సహోద్యోగులపైనే జవాన్ కాల్పులు: అనంతరం తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య

by samatah |   ( Updated:2024-01-24 07:21:32.0  )
సహోద్యోగులపైనే జవాన్ కాల్పులు: అనంతరం తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాం రైపిల్స్‌కు చెందిన ఓ సైనికుడు సహచర జవాన్లపైనే కాల్పుడు జరిపాడు. అనంతరం తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ కాల్పుల్లో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి. దక్షిణ మణిపూర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. అస్సాం రైఫిల్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘మణిపూర్‌లో శాంతి భద్రతల దృష్యా దక్షిణ మణిపూర్‌లోని ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ బెటాలియన్ విధులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం చురచంద్‌పూర్‌కు చెందిన జవాన్ తన తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తానే కాల్చుకున్నాడు. గాయపడిన వారిని వెంటనే చురచంద్‌పూర్‌లోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని అస్సాం రైఫిల్స్ తెలిపింది. ఘాతుకానికి పాల్పడిన సైనికుడు ఇటీవలే డ్యూటీలో చేరినట్టు తెలుస్తోంది.

ఘటనపై విచారణకు ఆదేశం

‘గాయపడిన వారిలో ఎవరూ మణిపూర్‌కు చెందినవారు కాదు. కాబట్టి సంఘటన ప్రస్తుతం కొనసాగుతున్న అల్లర్లతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం’ అని అస్సాం రైఫిల్స్ తెలిపింది. అయితే బెటాలియన్ లో మణిపూర్‌కు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. శాంతిని నెలకొల్పడంలో భాగంగా సిబ్బంది అంతా కలిసే ఉంటారని పేర్కొంది.కాగా, గతేడాది మే 3నుంచి కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story