- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jaishankar: ట్రంప్ పాలనలో భారత్ కు ప్రత్యేక స్థానం.. తొలి భేటీ ఎవరితో అంటే?

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తొలిరోజే తనదైన మార్క్ ని చూపించారు. అయితే, ట్రంప్ 2.0 హయాంలో భారత్ కు ప్రత్యేక స్థానం కన్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. కాగా.. ఆతర్వాత భారత విదేశాంగమంత్రి జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar)తో సమావేశమయ్యారు. అగ్రరాజ్య విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యతలు స్వీకరించిన గంట లోపే ఈ సమావేశం జరగడం గమనార్హం. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ భేటీ అయ్యారు. భారత్ - అమెరికా (India - US) వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా కూడా పాల్గొన్నారు. సమావేశం అయ్యాక జైశంకర్, రిబియో మీడియా ఎదుట కరచాలనం చేస్తూ కన్పించారు. మీడియా ఫొటోలకు ఫోజులిచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు అగ్ర దౌత్యవేత్తల మధ్య సమావేశం అమెరికా విదేశాంగ శాఖలోని ఫాగీ బాటమ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. భారత్ కి ప్రాధాన్యతనిస్తూ వాషింగ్టన్ ఈ భేటీని ఏర్పాటు చేసింది. మరోవైపు, రూబియోతోపాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌తోనూ జైశంకర్ సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనం కోసం ప్రపంచ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ఇరుదేశాల స్నేహాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించామని జైశంకర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
చైనాకు క్వాడ్ వార్నింగ్..
ఇక, ఈ భేటీకి ముందు జైశంకర్.. క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత జరిగిన ఈ తొలి క్వాడ్ భేటీలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. కాగా.. నాలుగు దేశాల మంత్రులు గంటకు పైగా చర్చలు జరిపారు. కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతలు, స్వేచ్ఛాయుత సహకారం వంటి అంశాలపై నాలుగు దేశాల మంత్రులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు తీసుకునే ఏకపక్ష చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ క్వాడ్ కూటమి.. చైనాను పరోక్షంగా హెచ్చరించింది.