Israel: అక్టోబర్ 7 దాడికి ఐడీఎఫ్ వైఫల్యమే కారణం.. ఇజ్రాయెల్ అంతర్గత దర్యాప్తులో వెల్లడి !

by vinod kumar |
Israel: అక్టోబర్ 7 దాడికి ఐడీఎఫ్ వైఫల్యమే కారణం.. ఇజ్రాయెల్ అంతర్గత దర్యాప్తులో వెల్లడి !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వైఫల్యం కారణంగానే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ (Israel) పై భారీ దాడి జరిగిందని ఐడీఎఫ్ అంగీకరించింది. హమాస్ ఉద్దేశాలను, సామర్థ్యాలను అంచనా వేయడంలో సైన్యం విఫలమైందని ఆ పరిస్థితులే అటాక్ చేయడానికి దారితీశాయని ఇజ్రాయెల్ సైన్యం అంతర్గత దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఐడీఎఫ్ విఫలమైందని దర్యాప్తులో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. సైనిక అధికారులు ఊహించినట్లుగా, హమాస్ ఎనిమిది సరిహద్దు పాయింట్ల నుంచి భూ దండయాత్రకు పాల్పడొచ్చని కానీ హమాస్‌కు 60 కంటే ఎక్కువ దాడి మార్గాలు ఉన్నాయని వెల్లడించారు.

హమాస్ గతంలో మూడుసార్లు దాడి చేయడానికి ప్రయత్నించిందని కానీ కానీ పలు కారణాల వల్ల దానిని ఆలస్యం చేసిందని దర్యాప్తులో వెల్లడైంది. దాడికి కొన్ని గంటల ముందు, ఇజ్రాయెల్ సైన్యానికి దాడి ముప్పు పెరుగుతోందని కొన్ని సూచనలు అందాయని, అయినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని తేలింది. అయితే హమాస్ యుద్ధం కోరుకోవడం లేదనే ఐడీఎఫ్ సైన్యం భావించడంతో దాడిని అడ్డుకోలేకపోయింది. సైన్యం తన జ్ఞానంపై అతి విశ్వాసంతో ఉందని మరియు దాని స్వంత ఆలోచనలపై సందేహం లేదని నివేదిక పేర్కొంది. అక్టోబర్ 7న జరిగిన దాడికి ప్రధాన సూత్రధారిగా గత అక్టోబర్‌లో మరణించిన యాహ్యా సిన్వరేనని ఇజ్రాయెల్ తెలిపింది. 2017 నుంచే దీనికి ప్రణాళిక వేయడం ప్రారంభించినట్టు తెలుస్తోంది.

కాగా, అక్టోబర్ 7న జరిగిన దాడిలో దాదాపు 1,200 మంది మరణించగా 251 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరగగా గాజాలో 48000 మంది పాలస్తీనియన్లు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాజా ప్రాంతమంతా రాకెట్, క్షిపణి దాడులతో దద్దరిల్లింది. ఈ క్రమంలో ఖతార్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

Next Story

Most Viewed