Pollution: వాయు కాలుష్యంతో మూడేళ్లకు పైగా ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు

by Harish |
Pollution: వాయు కాలుష్యంతో మూడేళ్లకు పైగా ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు
X

దిశ, నేషనల్ బ్యూరో: నిరంతరం పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా భారతీయులు సగటున మూడేళ్లకు పైగా ఆయుష్షును కోల్పోతున్నారని చికాగో విశ్వవిద్యాలయం వాయు నాణ్యత జీవన సూచిక ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 ’ నివేదిక తాజాగా పేర్కొంది. కాలుష్య స్థాయిలు 2021తో పోల్చితే 2022లో 19.3 శాతం తగ్గినప్పటికీ, ఇంకా కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్ర ప్రతికూలంగా ఉందని, కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే భారతదేశంలోని సగటు మనిషి 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుష్షును కోల్పోయే అవకాశం ఉందని విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది.

బంగ్లాదేశ్ కలుషితమైన దేశంగా ఉండగా, అధిక జనాభా కారణంగా భారత వాయు కాలుష్యం కారణంగా అత్యధిక ఆరోగ్య భారాన్ని ఎదుర్కొంటుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో ఉత్తర మైదాన ప్రాంతాలు అత్యంత కలుషితమైనవిగా నిలిచాయి. దాదాపు 40 శాతం మంది ఇక్కడ ఈ ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. 2022లో ఈ ప్రాంతంలో కాలుష్య స్థాయిలు 17.2 శాతం తగ్గినప్పటికీ, ఈ కాలుష్య స్థాయిలు ఇలాగే, కొనసాగితే సగటున ఒక వ్యక్తి 5.4 సంవత్సరాల ఆయుష్షును కోల్పోతారని అంచనా. ఒకవేళ వెంటనే అప్రమత్తం అయి, కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లయితే ఆయుష్షు 1.2 సంవత్సరాల పెరుగుదలకు అవకాశం ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దేశంలోనే అత్యధిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. సగటున, ఈ రాష్ట్రాల్లో నివసిస్తున్న 292.3 మిలియన్ల ప్రజలు ఇప్పుడు 2.9 సంవత్సరాల ఆయుష్షును కోల్పోతున్నారు. పంటలను కాల్చడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలకు దోహదపడ్డాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఈవీ వాహనాల వాడకం వంటి వాటి ద్వారా గతంతో పోలిస్తే, వాతావరణ కాలుష్యం కొంత వరకు తగ్గినట్టు నివేదిక తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed