Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికార కూటమిలదే హవా

by Shamantha N |
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికార కూటమిలదే హవా
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వస్తున్నాయి. కాగా.. మహారాష్ట్రలో అధికార మహాయుతి(NDA) మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(MVA) పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.

జార్ఖండ్ లో జేఎంఎం ఆధిక్యం

కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్ లో ఇండియా కూటమి(INDIA Bloc) నేతృత్వంలోని అధికార జేఎంఎం (Jharkhand Mukti Morcha) కూటమి జోరు ప్రదర్శిస్తోంది. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 49, బీజేపీ నేతృత్వంలోని కూటమి 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్ 41.

లక్ష ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక

మరోవైపు, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ పై లక్ష ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. బర్‌హైత్‌లో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండే స్థానంలోలో ఆయన భార్య కల్పనా సోరెన్‌ ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ సౌత్‌ వెస్ట్‌లో బీజేపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్‌ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కోప్రిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నారు. వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్‌ (ఎన్సీపీ) ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed