- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనున్న టీమ్ ఇండియా

- ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న భారత జట్టు
- బుమ్రా లేకపోవడం పెద్దలోటు
- యువ బ్యాటర్లు రాణిస్తారా?
- సీనియర్లు గాడిన పడతారా?
- బంగ్లాను తేలికగా తీసుకుంటే తిప్పలు తప్పవు
దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగింది. హైబ్రీడ్ మోడల్‌లో ఈ టోర్నీ నిర్వహిస్తుండటంతో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆడనుంది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌తో ఇండియా, బంగ్లాలు తమ టోర్నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న భారత జట్టు కీలకమైన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా లేకుండానే మ్యాచ్‌లు ఆడనుంది. తమదైన రోజుల చెలరేగిపోయే బంగ్లాదేశ్ జట్టుతో భారత్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే మ్యాచ్ ఫలితం మారిపోయే అవకాశం ఉంది. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫామ్‌ను తిరిగి పొందుతారా? యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విదేశీ గడ్డపై ఒత్తిడిని తట్టుకొని నిలకడగా రాణించగలరా? బుమ్రా లేని లోటును భారత బౌలర్లు తీర్చగలరా? అనే అనుమానాలు భారత ఫ్యాన్స్‌కు కలుగుతున్నాయి.
సీనియర్లు రాణించాల్సిందే..
న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తగిలిన ఎదురు దెబ్బలు టీమ్ ఇండియాలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. కోహ్లీ, రోహిత్‌లపై వేటు వేయాలని గత కొంత కాలంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీలు వారిద్దరూ రాణించడంపైనే వారి క్రికెట్ భవిష్యత్ ఆధారపడింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ చాంపియన్స్ ట్రోఫీ విషమ పరీక్షే. అయితే ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేయడం, కోహ్లీ అర్థ సెంచరీతో రాణించడం భారత జట్టులో ఆశలు రేపుతోంది. అంతే కాకుండా వైఫల్యాలతో మొదలు పెట్టిన గౌతమ్ గంభీర్.. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ఊరట కలిగించే అంశం. యువ ఓపెనర్ శుభమన్‌గిల్ వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అయితే స్వదేశీ గడ్డపై అద్భుతమైన ఫామ్‌తో ఉన్న గిల్.. విదేశీ పిచ్‌లపై రాణించాల్సిన అవసరం కూడా ఉంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక కీలకంగా మారనుంది. కేఎల్ రాహుల్ జట్టులో ఉంటే అతను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది కీలకం. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ వస్తే, 6వ స్థానంలో అక్షర్ పటేల్ దిగే అవకాశం ఉంది. లేకపోతే అక్షర్‌కు ప్రమోషన్ ఇస్తే రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వస్తుంది. అయితే మ్యాచ్ రోజు పిచ్, ఆట పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
బౌలింగ్ భారం షమీపైనే..
భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గైర్హాజరీతో బౌలింగ్ భారమంతా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపైనే ఉంది. షమీతో న్యూ బాల్ భాగ్వామిగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాల్లో ఎవరిని దింపుతారనే ఆసక్తిగా మారింది. రాణా ఇప్పటి వరకు బంతితో రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మొదటి నుంచి అద్భుతమైన వేగం, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. అయితే అర్ష్‌దీప్ ఎడమ చేతి వాటం బౌలర్ కావడంతో.. బౌలింగ్‌లో వైవిధ్యం కోసం షమీతో అతడినే మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేయించే అవకాశం ఉంది. ఇక భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు ఎవరు మూడో స్పిన్నర్‌గా దింపాలనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కు కష్టమైన ఎంపికే. కుల్దీప్ యాదవ్ లేదా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మధ్య మూడో స్పిన్నర్ స్థానం కోసం పోటీ నడుస్తోంది. హార్దిక్ పాండ్యాను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడు.
షకీబుల్ హసన్ వంటి స్టార్లు లేకపోవడం బంగ్లా జట్టుకు పెద్దలోటుగా భావించాలి. అయితే భారత్‌తో మ్యాచ్ అనగానే బంగ్లా క్రికెటర్లు సర్వశక్తులు ఒడ్డుతారు. తమదైన రోజున సంచలనాలు నమోదు చేస్తారు. ఇండియాతో జరిగే మ్యాచ్‌ను కూడా బంగ్లా క్రికెటర్లు ఆషామాషీగా తీసుకోరు. భారత జట్లు లోపాలను వారు తప్పకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్:
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు, మొదట్లో సీమ్‌ను ఉపయోగించుకొని బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. అయతే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. మ్యాచ్‌లో మంచు కీలక అంశం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. వెలుతురులో బ్యాటింగ్ చేయడం దుబాయ్ పిచ్‌పై అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మంచు కారణంగా స్పిన్నర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇప్పటివరకు 58 వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ పరుగులు 218. ఈ వేదికలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఛేజింగ్ చేసిన చేసిన జట్టు 34 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
భారత్: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తస్సాయ్ హస్మాన్, పర్వేజ్ హస్మాన్, సాకిబ్, నహిద్ రాణా.
* మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అవుతుంది
** స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.