'అధికారం కోసం వాళ్లు ఏమైనా చేస్తారు'.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

by Vinod kumar |
అధికారం కోసం వాళ్లు ఏమైనా చేస్తారు.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్
X

ప్యారిస్ : బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని ఆరోపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ‘సైన్సెస్ పీఓ’ యూనివర్సిటీలో విద్యార్థులు, విద్యావేత్తలతో జరిగిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ‘‘హిందూ నేషనలిస్ట్ అనే పదానికి హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు. నేను భగవద్గీత, ఉపనిషత్తులు చదివాను. అనేక హిందూ పుస్తకాలు చదివాను. బీజేపీ చేసే దానిలో హిందూయిజం ఏమీ లేదు. నీకంటే బలహీనులను భయపెట్టాలని, హాని చేయాలని ఏ హిందూ పురాణాల్లోనూ లేదు. ఏ పండితుడైన హిందూ వ్యక్తి నుంచి కూడా నేను ఆ మాటను వినలేదు. బీజేపీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అధికారం కోసం వాళ్లు ఏమైనా చేస్తారు’’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘నాపై 24 కేసులు ఉన్నాయి. క్రిమినల్ పరువు నష్టం కేసులో భారత్‌లో తొలిసారిగా గరిష్ట శిక్ష నాకే పడింది.

మేము ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలను బతికించేందుకు నిత్యం పోరాడుతున్నాం’ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఉన్నందువల్లే మోడీ ప్రభుత్వం.. దేశానికి ‘భారత్’ అని పేరు మార్చాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘రాజ్యాంగం ప్రకారం దేశానికి రెండు పేర్లు ఉన్నాయి. ఇందులో నాకు ఎలాంటి సమస్యా కనిపించడం లేదు. రెండు పేర్లూ ఆమోదయోగ్యమే. కానీ మా కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడం వల్ల ప్రభుత్వ పెద్దలకు చికాకు కలిగిందని అనుకుంటున్నాను. దేశం పేరును మార్చాలనుకునే వ్యక్తులు ప్రాథమికంగా దేశ చరిత్రను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశ చరిత్ర భావితరాలకు తెలియాలని వారు కోరుకోవడం లేదు’’ అని రాహుల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed