Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత తొలిసారి అక్కడ హోలీ వేడుకలు

by D.Reddy |   ( Updated:2025-03-13 15:12:12.0  )
Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత తొలిసారి అక్కడ హోలీ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు హిందువులు హోలీ (Holi) పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న (శుక్రవారం) ఈ హోలీ పండుగ వచ్చింది. రంజాన్ (Ramjan) మాసం కావటం, అదే రోజు ముస్లింలు ప్రార్థనల నేపథ్యంలో యూపీ మొరాదాబాద్ జిల్లాలోని సంభల్ (Sambhal) ప్రాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. సంభల్‌లో 46 ఏళ్ల తర్వాత తొలిసారి తిరిగి హోలీ వేడుకలు జరుగనున్నాయి. 1978లో సంభాల్‌లో భారీగా మత ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి అక్కడ శాంతిభద్రతల దృష్ట్యా హోలీ వేడుకలు జరగటం లేదు.

మార్చి 28, 1978లో సంభాల్‌లో అతిపెద్ద అల్లర్లు జరిగాయి. హోలికా దహన్ స్థలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సంభాల్ చుట్టుపక్కల అన్ని ఊర్లలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పొయారు. కొంతమంది మృతదేహాలు దొరకకపోవడంతో వారి బొమ్మలను దహనం చేశారు. ఈ కేసులో 48 మంది నిందితులుగా ఉన్నారు. కానీ తగిన ఆధారాలు లేకపోవడంతో 2010లో అందరూ నిర్దోషులుగా విడులయ్యారు. ఈ అల్లర్ల తర్వాత సంభల్‌లోని పురాతనమైన కార్తికేయ మహాదేవ్ ఆలయాన్ని మూసివేశారు. అలాగే, అక్కడ ఉండే హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో సంభల్‌లో ఉన్న హిందువులు అక్కడ మైనారిటీ (20శాతం)లుగా మారారు.

అయితే, గత ఏడాది నవంబరులో ASI సర్వే, తవ్వకాల్లో పురాతనమైన హిందూ గుళ్లు, లింగాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులు పెద్ద ఎత్తున హోలీ పండుగలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వేడుకలు మొదలవ్వటంతో మహదేవ్ మందిరం రంగులమయంగా మారింది. అయితే, హొలీ వేడుకల నేపథ్యంలో అధికారులు సంభాల్‌లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు.

ఇక ఇటీవల 'హోలీ ఏడాదిలో ఒక్కసారే వస్తుంది.. జుమ్మా ఏడాదిలో 52 సార్లు వస్తుంది. హోలీ రోజు రంగులు పడి తమ దీక్ష భంగమవుతుందని ముస్లింలు అనుకుంటే ఇళ్ల నుంచి బయటకు రావద్దు. హోలీ పండుగ నాడు హిందువులు స్వీట్లు పంచుకున్నట్టే , రంజాన్‌ నాడు ముస్లింలు స్వీట్లు తింటారు' అని సంభల్‌ సర్కిల్‌ పోలీసు ఆఫీసర్‌ అనూజ్‌ చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అలాగే, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల తర్వాత కార్తికేయ మహాదేవ్ ఆలయంలో హోలీ ఆడే భాగ్యం మనకు లభించిందని ఆయన అన్నారు.

Click For Tweeter Post..

Next Story

Most Viewed