కూలిన హై లెవెల్ ఫ్లైఓవర్.. కళ్ల ముందే భారీ ప్రమాదం!

by karthikeya |
కూలిన హై లెవెల్ ఫ్లైఓవర్.. కళ్ల ముందే భారీ ప్రమాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మాణంలో ఉన్న ఓ భారీ హై లెవెల్ ఫ్లైఓవర్ (Fly-over) ఉన్నట్లుండి కూలిపోయింది. కళ్ల ముందే ఈ భారీ ప్రమాదం సంభవించడంతో స్థానికులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే రాత్రివేళ కూలడంతో వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయని, ఫలితంగా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు (Tamilnadu)లోని తిరుపత్తూరు జిల్లా అంపూర్‌‌లోని చెన్నై - బెంగళూరు నేషనల్ హైవే (Chennai-Banglore National Highway)పై 2023 నుంచి 4 కిలోమీటర్ల పొడవైన హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. బస్ స్టేషన్ - రైల్వే స్టేషన్ మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సులభమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. శనివారం (సెప్టెంబర్ 21) ఉన్నట్లుండి పెద్ద శబ్దం చేస్తూ.. ఫ్లైఓవర్‌కు ఒకవైపు నిర్మించిన ఇనుప నిర్మాణం 20 మీటర్ల మేర కూలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైఓవర్‌పై పనిచేస్తున్న బీహార్‌ (Bihar), జార్ఖండ్‌ (Jharkhand)కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని రక్షించి అంబూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed