H-1B visa: ‘హెచ్-1బీ’ వీసా వివాదం ముగిసినట్టేనా.. ట్రంప్ ప్రకటనతో మారిన సీన్!

by vinod kumar |
H-1B  visa: ‘హెచ్-1బీ’ వీసా వివాదం ముగిసినట్టేనా.. ట్రంప్ ప్రకటనతో మారిన సీన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో కొంత కాలంగా ‘హెచ్ -1 బీ’ వీసా అంశంపై చర్చ నడుస్తోంది. ఏఐ అడ్వైజర్‌గా భారత సంతతి నేత శ్రీరామ్ కృష్ణన్ (Srirama Krishnan) నియామకంతో మొదలైన కాంట్రవర్సీ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఈ వీసాను వ్యతిరేకిస్తున్న ట్రంప్‌(Trump) తన పంథాను మార్చుకున్నారు. దానికి తాను మద్దతిస్తున్నట్టు తెలిపారు. ‘నేను హెచ్-1బీ వీసాను నమ్ముతాను. చాలాసార్లు ఉపయోగించాను. ఇది గొప్ప ప్రోగ్రామ్’ అని తాజాగా ప్రకటించారు. ఎలాన్ మస్క్ (Elon musk) , వివేక్ రామస్వామి (vivek Ramaswamy), శ్రీరామ్ కృష్ణన్ (Sriram krishnan) , డేవిడ్ సాచ్‌ల అభిప్రాయాలను సమర్థించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ 2.0 కేబినెట్‌లో చిచ్చు రేపిన ‘హెచ్-1బీ’ వీసా వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్టు అయింది. అయితే ఈ అంశంపై ట్రంప్ మద్దతు దారులు రెండుగా విడిపోయారు. కానీ ట్రంపు మాత్రం ఒక వర్గానికే మద్దతు తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో మొత్తం వివాదం ఎందుకు తలెత్తిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వివాదం మొదలైందిలా

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన కేబినెట్‌లో పలువురిని నియమించుకుంటున్నారు. ఇందులో భారత సంతతి నేతలకు సైతం కీలక పదవులు దక్కాయి. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్‌ పాలసీ అడ్వైజర్‌గా భారత సంతతి వ్యక్తి శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించారు. దీనిపై ట్రంప్ వర్గంలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరామ కృష్ణణ్ నియామకాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ మద్దతుదారైన లారా లూమర్ స్పందిస్తూ.. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు వర్క్ వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వాలని గతంలో కృష్ణన్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. ఇది ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. సీనియర్ నేతలైన నిక్కీ హేలీ, మాట్ గేట్జ్ వంటి నాయకులు కూడా ఇమ్మిగ్రేషన్ విధానంపై లారా లూమర్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు.

మస్క్ ఎంట్రీతో హాట్ టాపిక్‌గా మారిన డిస్కషన్

నిక్కీ హేలీ, మాట్ గేట్జ్‌లకు వ్యతిరేకంగా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భిన్నాబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో ఇంజినీరింగ్ ప్రతిభకు కొరత ఉందని తెలిపారు. అద్భుత విజయాలు సాధించాలంటే నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘అమెరికా ఓటమిని చూడాలనుకుంటున్నారా? మీరు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రభావవంతమైన వ్యక్తులను మరొక వైపు ఉండటానికి అనుమతిస్తే, అమెరికా ఓడిపోతుంది. ఎవరైనా, ఏ జాతి వారైనా అమెరికా అభివృద్ధికి సహకరిస్తే ఆయనకు గౌరవమిస్తాం’ అని తెలిపారు. అమెరికా స్వేచ్ఛ, అవకాశాల దేశమని, దానిని అలాగే ఉంచడానికి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని పేర్కొన్నారు. అలాగే భారతీయ సంతతి నేత వివేక్‌ రామస్వామి సైతం ఈ అంశానికి మద్దతిచ్చారు. దీంతో ట్రంప్ ప్రమాణస్వీకారం చేయకముందే ఆయన మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఒక్కసారిగా ట్రంప్ 2.0పై ఉత్కంఠ నెలకొంది.

ఇరు వర్గాల వాదనలివే!

హెచ్-1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే స్థానాలకు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలను అనుమతిస్తుంది. ఈ వీసా ద్వారా టెక్నాలజీ రంగంలోని కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ఐటీ , ఆర్కిటెక్చర్, ఆరోగ్య రంగాల్లోని నిపుణులు మాత్రమే ఈ వీసా పొందగలరు. అయితే లారా లూమర్, మాట్ గేట్జ్, ఆన్ కౌల్టర్ వంటి ట్రంప్ మద్దతుదారులు ఈ వీసాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెచ్-1బీ వీసా వల్ల విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు వస్తాయని, యూఎస్ ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారని చెబుతున్నారు. కానీ ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలు హెచ్-1బీ వీసాకు మద్దతు పలికారు. అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అనేక కంపెనీలు అభివృద్ధి చెందటానికి హెచ్‌-1బీ వీసాదారులే కారణమని వాపోతున్నారు.

ట్రంప్ నిర్ణయాన్ని కొనసాగించేనా?

గతంలో హెచ్ 1బీ వీసాను వ్యతిరేకించిన ట్రంప్ ప్రస్తుతం దానికి మద్దతు తెలపారు. అయితే ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు మద్దతిస్తున్నట్టు తెలిపారా? లేక తన వైఖరిని మార్చుకున్నారా? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీంతో ట్రంప్ ప్రమాణం అనంతరం వీసాపై ఇదే అభిప్రాయాన్ని కొనసాగిస్తారా? లేక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం తప్పదని పలు మార్లు హెచ్చరించిన ట్రంప్ మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed