నీట్ పేపర్ లీక్‌లో అంతర్‌రాష్ట్ర కుట్రను పరిశీలిస్తున్న సీబీఐ

by S Gopi |
నీట్ పేపర్ లీక్‌లో అంతర్‌రాష్ట్ర కుట్రను పరిశీలిస్తున్న సీబీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి అంతర్‌రాష్ట్ర లింకులతో కూడిన భారీ కుట్ర దాగి ఉందని సీబీఐ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. బీహార్‌లో నమోదైన ఇతర కేసులతో పాటు గోద్రాలో కోట్లాది రూపాయల చీటింగ్ కేసును స్వాధీనం చేసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులు ఇతర రాష్ట్రాల లీకులతో కూడా సంబంధాలున్నట్టు సందేహాలున్నాయని పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన రూ. 2.3 కోట్ల నగదు, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకుంది. ఆరిఫ్ నూర్ మహ్మద్ వోహ్రా, పురుషోత్తం శర్మ, విభోర్ ఆనంద్, తుషార్ భట్‌లతో సహా నలుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం గోద్రా కోర్టును ఆశ్రయించింది. వీరి వద్ద కీలకమైన సమాచారం ఉందని కోర్టుకు తెలియజేసింది. గోద్రా పోలీసుల ప్రకారం, నీట్ పరీక్ష జరిగిన జై బలరామ్ స్కూల్‌లో శర్మ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఆరిఫ్ నూర్ మధ్యవర్తిగా పనిచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తుషార్ భట్ అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్‌టీఏ శర్మను సిటీ-కోఆర్డినేటర్‌గా, తుషార్ భట్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామ్‌గా నియమించింది. నిందితులు గోద్రాలోని రెండు పాఠశాలలను తమ కేంద్రాలుగా ఎంపిక చేసుకునేలా అభ్యర్థులకు సూచించారని, గుజరాతీని తమకు ఇష్టమైన భాషగా ఎంచుకోవాలని చెప్పినట్టు సీబీఐ పేర్కొంది. 'గతేడాది కూడా ఈ రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారని వారికి తెలుసు. ఓఎంఆర్ షీట్లను పరీక్ష హాలులో రాత్రిపూట ఉంచారని కూడా తెలుసు. వాటిని తారుమారు చేసే అవకాశం ఉందని నిర్ధారించుకున్నారని సీబీఐ తరపు న్యాయవాది నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టుకు తెలిపారు.



Next Story