హై ప్రొఫైల్ సీట్లలో ‘తొలి’ హోరాహోరీ

by Dishanational4 |
హై ప్రొఫైల్ సీట్లలో ‘తొలి’ హోరాహోరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం పూర్తయింది. ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఓటింగ్ జరగనుండగా.. తొలిదశలోనే అత్యధికంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ స్థానాల్లో కొన్ని హై ప్రొఫైల్ సీట్లు ఉన్నాయి. వాటిలో పలువురు దిగ్గజ నేతలు హోరాహోరీగా తలపడ్డారు. అటువంటి హాట్ సీట్లపై ఫోకస్.

చెన్నై సౌత్ (తమిళనాడు)

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ ఆమె ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా తమిళచి తంగపాండియన్, ఏఐఏడీఎంకే అభ్యర్థిగా జే జయవర్ధన్‌ పోటీ చేశారు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ట్రాక్ రికార్డు జయవర్ధన్‌కు ఉంది. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఈ స్థానం నుంచి విజయం సాధించారు. మొదటి నుంచీ చెన్నై సౌత్ స్థానం డీఎంకేకు కంచుకోటగా ఉంది. టీఆర్ బాలు 1996 నుంచి 2004 వరకు ఈ సీటు నుంచి వరుసగా గెలిచారు. ఇటీవల వరదల టైంలో సహాయక చర్యలు చేపట్టడంలో డీఎంకే విఫలమైందనే అంశంతో తమిళిసై జనంలోకి వెళ్లారు. డెవలప్మెంట్ వర్క్స్, సంక్షేమ పథకాలను చూసి గెలిపించాలని డీఎంకే కోరుతోంది.

కోయంబత్తూరు (తమిళనాడు)

తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీకి కేవలం 3.7 శాతం ఓట్లే వచ్చాయి. ఈవిషయం తెలిసినా ఈసారి మెరుగైన ఫలితాన్ని సాధించాలనే టార్గెట్‌తో కె అన్నామలై‌ను కాషాయ పార్టీ అగ్రనేతలు బరిలోకి దింపారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి గణపతి పి.రాజ్‌కుమార్‌‌కు స్థానికంగా ఓటర్లపై మంచి పట్టు ఉంది. ఆయన 2014 నుంచి 2016 వరకు నగర మేయర్‌గా వ్యవహరించారు. అంతకుముందు వరకు అన్నా డీఎంకేలో ఉన్న గణపతి.. 2020 డిసెంబరులోనే డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఈ సీటు నుంచి సీపీఎం అభ్యర్థి పీఆర్‌ నటరాజన్‌ దాదాపు 1.8 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.

గయా (బిహార్)

బిహార్‌లో రాజధాని పాట్నా తర్వాత అతిపెద్ద నగరం గయా. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేయబడిన రాష్ట్రంలోని ఆరు లోక్‌సభ స్థానాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ అవామీ మోర్చా (సెక్యులర్) అధినేత జితన్ రామ్ మాంఝీ పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని బోధగయ సెగ్మెంట్‌కు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉండటం ప్లస్ పాయింట్. ఎన్‌డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ పార్టీల మద్దతు ఉండటం మాంఝీకి మరో అడ్వాంటేజ్. ఇక్కడి నుంచి ఆయనకు ప్రధాన ప్రత్యర్ధిగా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత కుమార్ సర్వజీత్ ఉన్నారు. జితన్ మాంఝీ 2014, 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. జేడీయూ నేత విజయ్ మాంఝీ, బీజేపీ నేత హరి మాంఝీ చేతిలో ఓటమి ఎదురైంది., ఈసారి జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు కావడంతో రిజల్టు మారుతుందని అంచనా వేస్తున్నారు.

కైరానా (ఉత్తరప్రదేశ్)

ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ చౌదరి, ఎస్పీ అభ్యర్థి ఇక్రా హసన్, బీఎస్పీ అభ్యర్థి శ్రీపాల్ రాణా మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ముస్లిం ఓటుబ్యాంకుతో పాటు కశ్యప్, జాట్, గుర్జార్ తదితర వర్గాల ఓటర్ల సాయంతో గెలుస్తామని ఇక్రా హసన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ స్థానంలో 48.92 శాతం ఓటింగే జరిగింది.

పిలిభిత్ (ఉత్తర ప్రదేశ్)

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా వరుణ్ గాంధీ ఉన్నారు. కానీ ఆయనకు ఈసారి బీజేపీ టికెట్‌ను కేటాయించలేదు. వరుణ్ గాంధీకి బదులుగా.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాదకు పిలిభిత్‌ను కాషాయ పార్టీ బరిలోకి దింపింది. గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వకుండా.. కొత్త నేతను ఇక్కడి నుంచి బరిలోకి దింపడం ద్వారా బీజేపీ పెద్ద ప్రయోగమే చేసింది. ఇందులో ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాంపూర్ (యూపీ)

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం అనేది ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు కంచుకోట. ఈసారి ఎన్నికల్లో ఆయన ఊసేలేదు. ఆజం ఖాన్ జైలులో ఉన్నప్పటికీ.. ఆయన వర్గం వారికి ఇక్కడ బలమైన పట్టు ఉంది. ఆజం ఖాన్‌ అనుచరుల అండ లేకుండా ఇక్కడి నుంచి సమాజ్ వాదీ అభ్యర్థి గెలవడం అసాధ్యమని అంటుంటారు. సమాజ్ వాదీ అభ్యర్థిగా మొహిబుల్లా నద్వీ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి జీషాన్ ఖాన్, బీజేపీ నుంచి ఘన్ శ్యాం లోడీ బరిలోకి దిగార. గతంలో ఈ లోక్‌సభ స్థానానికి జరిగిన బైపోల్‌లో బీజేపీ నేత ఘన్ శ్యాం లోడీ గెలిచారు.

Next Story

Most Viewed