MEA: యూకేలో ఎమర్జెన్సీ సినిమాపై నిరసనలు.. విదేశాంగ శాఖ ఏమందంటే?

by Shamantha N |
MEA: యూకేలో ఎమర్జెన్సీ సినిమాపై నిరసనలు.. విదేశాంగ శాఖ ఏమందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీకి బ్రిటన్ తిప్పలు ఎదురయ్యాయి. అయితే, ఆ సినిమాను అడ్డుకోవడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. సినిమాను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ‘‘ఎమర్జెన్సీ మూవీని ప్రదర్శించకుండా చాలా థియేటర్లలో అడ్డుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. భారత వ్యతిరేక శక్తుల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన అంశాలను బ్రిటన్ ప్రభుత్వం దగ్గర లేవనెత్తుతూనే ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి. మూవీని అడ్డుకునే ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. భారత దౌత్యకార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం’’ అని జైస్వాల్‌ అన్నారు. ఇకపోతే, కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ ఎమర్జెన్సీ మూవీని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమా స్టార్ట్ అయిన దాదాపు 30 లేదా 40 నిమిషాల తర్వాత, ముసుగు ధరించిన ఖలిస్తానీ ఉగ్రవాదులు లోపలికి చొరబడి, ప్రేక్షకులను బెదిరించి, ప్రదర్శనను ముగించమని బలవంతం చేసినట్లు తెలిపారు. సినిమా వివాదాస్పదమైందని.. అందులోని కంటెంట్ గురించి తాను మాట్లాడబోనని అన్నారు. అయితే, ఆ సినిమాని ప్రజల్ని ఆ సినిమా చూడకుండా చేసే హక్కుని మాత్రం సమర్థించబోనన్నారు. ఎమర్జెన్సీ మూవీని ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర మాస్కులు ధరించిన ఖలిస్థానీ మద్దతుదారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో, విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పన్నూ..!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Pannun) ప్రత్యక్షమయ్యారు. కాగా.. ఈ ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికా దగ్గర ప్రస్తావిస్తూనే ఉంటామంది. ‘‘భారత వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన ప్రతిసారి ఆ విషయాన్ని మేం అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. భారత దేశ భద్రతపై ప్రభావం చూపే, భారత్‌ వ్యతిరేక ఎజెండాలపై ఆందోళనలను అక్కడి ప్రభుత్వం దగ్గర లేవనెత్తుతూనే ఉంటాం’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ఇకపోతే, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత లిబర్టీ బాల్‌లో ఏర్పాటు చేసిన ప్రముఖుల కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అక్కడే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ కనిపించాడు. అయితే, పన్నూకు ఆహ్వానం అందకున్నా.. ఇతరుల సాయంతో ఈవెంట్ కోసం టికెట్లు పొందినట్లు కథనాలు వచ్చాయి. ట్రంప్‌ వేదికపైకి వచ్చిన సమయంలో ‘యూఎస్‌ఏ, యూఎస్‌ఏ’ అని ఈవెంట్ లోని వారంతా నినాదాలు చేస్తుంటే.. పన్నూ మాత్రం ఖలిస్థానీకి మద్దతుగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. విదేశాంగ శాఖ స్పందించింది.

Next Story