మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఝలక్.. బీజేపీలో చేరిన నేతలు

by Disha Web Desk 17 |
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఝలక్.. బీజేపీలో చేరిన నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హరి వల్లభ్ శుక్లా తన మద్దతుదారులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి భోపాల్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కొత్త జాయినింగ్ కమిటీ కన్వీనర్, రాష్ట్ర మాజీ మంత్రి నరోతమ్ మిశ్రా, రాష్ట్ర మంత్రి గోవింద్ రాజ్‌పుత్, ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన బీజేపీ నాయకుడు సురేష్ పచోరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శుక్లా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానాలకు ఆకర్షితులై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభివృద్ధి విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే పార్టీలో చేరాను, కాంగ్రెస్ పార్టీ నిరాశలో ఉంది. సామాన్యుల పార్టీగా 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రజల సమస్యలను చర్చించడానికి దారులు మూసుకుపోయాయి. కేవలం నాయకుల కోసం మాత్రమే ఉందని అన్నారు. తాను పార్టీలో ఎలాంటి హోదా కోరలేదని, రాబోయే తరాలకు మాత్రమే పనిచేస్తానని శుక్లా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది, మొదటి దశ పూర్తికాగా, తదుపరి మూడు దశల ఓటింగ్ ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుంది.

Next Story

Most Viewed