Fishing ban: ఆగస్టు15 వరకు చేపల వేటపై నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం

by vinod kumar |
Fishing ban: ఆగస్టు15 వరకు చేపల వేటపై నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో చేపల వేటపై నిషేధాన్ని గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించింది. చేపల పెంపకానికి ఎక్కువ టైం ఇవ్వాలని మత్స్యకారుల సంఘం చేసిన ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. కేంద్రంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. శాస్త్రీయ డేటా, వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంది. పశ్చిమ తీరంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మత్స్యకారుల సంఘం చేసిన ఫిర్యాదులను కూడా విచారించి బ్యాన్ పొడిగించామని వెల్లడించింది.

కాగా, రాష్ట్రంలో వార్షిక చేపల వేట నిషేధం ప్రతి ఏటా జూన్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర మత్య్సశాఖ గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా.. గడువు పెంచినట్టు తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది సరైన పద్దతి కాదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు. మత్స్యకారులతో ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ అకస్మాత్తుగా మత్స్య చట్టం 2003 నిబంధనలను సవరించిందని, దీని వల్ల మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి మత్స్యకారులను వెంటనే సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story