నేడే తొలి దశ ఎన్నికలు.. 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు పోలింగ్

by Dishanational4 |
నేడే తొలి దశ ఎన్నికలు.. 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు పోలింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్‌సభ స్థానాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ఏరియాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే ఓటింగ్ ముగియనుంది. తొలివిడత ఎన్నికలు జరిగే 102 లోక్‌సభ స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ రిజర్వుడ్ ఉన్నాయి. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వారిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 16.63 కోట్ల మంది ఓటర్లు తమ వజ్రాయుధంతో తేల్చనున్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా, 11 వేల 371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67లక్షలమంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్‌ కోసం 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఈసీ.. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ పూర్తి కాగా.. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దాదాపు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.

లక్షలాది మందికి ఇంటి నుంచే ఓటువేసే ఛాన్స్..

50శాతం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 మంది ఎన్నికల పరిశీలకులను నియమించిన ఈసీ, వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వెల్లడించింది. 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2,028 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, 1255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 102 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 5 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహించనున్నారు. వెయ్యి పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తారు. తొలివిడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు వినియోగిస్తున్నారు.

10 రాష్ట్రాలు,యూటీలలోని అన్ని స్థానాలకు..

తమిళనాడు, ఉత్తరాఖండ్‌ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్‌ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్‌, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు కూడా తొలివిడతలోనే పోలింగ్‌ జరగాల్సి ఉన్నప్పటికీ.. ఔటర్‌ మణిపుర్‌ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా తొలి విడతలో 8 చోట్ల, 40 సీట్లున్న బిహార్‌‌లో 4 చోట్ల, 42 సీట్లున్న బెంగాల్‌లో 3 చోట్ల తొలి విడతగా పోలింగ్ జరగనుంది. అసోంలోని 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్‌‌లో 6, మహారాష్ట్రలో 5, రాజస్థాన్‌లో 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్ జరగనుంది.102 లోకసభ నియోజకవర్గాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలోని 92 అసెంబ్లీ స్థానాలకు పోల్స్ జరగనున్నాయి.

39 స్థానాల్లో 950 మంది అభ్యర్థులు..

తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో 950 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో 12స్థానాల నుంచి 114 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. యూపీలోని 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాలలో 55 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.

Next Story

Most Viewed