ఎన్‌సీపీలో చీలిక లేదు.. మొత్తం పార్టీ నా వెంటే : Ajit Pawar

by Vinod kumar |
ఎన్‌సీపీలో చీలిక లేదు.. మొత్తం పార్టీ నా వెంటే : Ajit Pawar
X

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యావత్ ఎన్‌సీపీ తన వెంటే ఉందని వెల్లడించారు. ఎన్‌సీపీ లో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎన్సీపీ పేరు, గుర్తుపైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఎన్‌సీపీ ఉండాలని పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారని తేల్చి చెప్పారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియా సమావేశంలో అజిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు.

రాష్ట్ర సర్కారులో చేరే అంశంపై పార్టీలో చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి కేబినెట్ పోర్ట్‌ఫోలియోలను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. త్వరలో మరోసారి రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని, ఇంకొంత మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రులుగా అవకాశం లభిస్తుందని తెలిపారు.

"సకాలంలో ముంబైకి చేరుకోలేకపోయిన.. విదేశాల్లో ఉన్న.. కొందరు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. వారు నాకు మద్దతు ఇస్తున్నారు" అని అజిత్ పేర్కొన్నారు. "మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం..మేం ఆనాడు శివసేనతో కలిసి నడిచాం.. ఇప్పుడు బీజేపీతో కలిసి నడవలేమా ? నాగాలాండ్‌లో ఎన్సీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే పనిని మహారాష్ట్రలో చేయలేమా ?" అని అజిత్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర ప్రజల బాగు కోసం.. గత 9 ఏళ్లుగా మోడీ సర్కారు దేశంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితమై రాష్ట్ర ప్రభుత్వంలో చేరామని ఆయన చెప్పారు. తమ ఫోకస్ ఇక అభివృద్ధి పనులపై మాత్రమే ఉంటుందన్నారు. మహారాష్ట్ర సర్కారులో మంత్రులుగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేతల్లో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, ప్రవీణ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా అత్రమ్, అదితి తత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు.

Advertisement

Next Story