శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు షాక్.. రూ.97 కోట్ల ఆస్తులు జప్తు

by Disha Web Desk 17 |
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు షాక్.. రూ.97 కోట్ల ఆస్తులు జప్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాడు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసింది. వీటిలో శిల్పాశెట్టి పేరు మీద రిజిస్టర్ చేసిన జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్, పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను అధికారులు జప్తు చేశారు.

వేరియబుల్ టెక్ Pte Ltd వ్యవస్థాపకుడు దివగంత అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్‌లతో సహ ఎంఎల్ఎం ఏజెంట్లపై గతంలో మహారాష్ట్ర పోలీసులు, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. నిందితులు బిట్‌కాయిన్‌ల రూపంలో నెలకు 10 శాతం రాబడి ఇస్తామని ప్రజల నుండి 2017లో రూ.6600 కోట్లను వసూలు చేసి వారిని మోసం చేశారు. దీంతో ఈ కేసును ఈడీకి అప్పగించారు.

ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను స్కామ్‌కు సూత్రధారి, ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వాటి విలువ ప్రస్తుతం రూ.150 కోట్లుగా ఉంది. ఇంతకుముందు, ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారని ఈడీ తెలిపింది. ప్రమోటర్లు పెట్టుబడిదారులను మోసం చేసి, ఆన్‌లైన్ వాలెట్లలో అక్రమంగా సంపాదించిన బిట్‌కాయిన్‌లను దాచిపెడుతున్నారని ఈడీ ఆరోపించింది.

Next Story