లిక్కర్ స్కాంపై ఈడీ తొమ్మిదో ఛార్జిషీట్.. కవిత గురించి కీలక ప్రస్తావన

by Hajipasha |
లిక్కర్ స్కాంపై ఈడీ తొమ్మిదో ఛార్జిషీట్.. కవిత గురించి కీలక ప్రస్తావన
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొమ్మిదో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చింది. కేసు విచారణలో భాగంగా మే నెలలోనే చౌహాన్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈమేరకు వివరాలతో శుక్రవారం రోజు ఢిల్లీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో తొమ్మిదో ఛార్జ్ షీట్‌ను ఈడీ అధికారులు సమర్పించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించి గతంలో కోర్టుకు సమర్పించిన అధికారిక డాక్యుమెంట్‌లోనూ వినోద్ చౌహాన్ పేరును ఈడీ ప్రస్తావించింది.

‘‘అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేం దినేష్ అరోరా కార్యాలయానికి వెళ్లాం. అక్కడి నుంచి నగదుతో నిండిన రెండు బరువైన బ్యాగులను తీసుకెళ్లి వినోద్ చౌహాన్‌కు ఇచ్చాం’’ అని కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు వాంగ్మూలం ఇచ్చారని గతంలోనే ఈడీ వెల్లడించింది. ‘‘అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేం ఇంకోసారి ఢిల్లీలోని తోడాపూర్ ఏరియాలో ఉన్న ఓ నివాసానికి వెళ్లాం. అక్కడి నుంచి డబ్బు కట్టలతో నిండిన రెండు బ్యాగులను తీసుకెళ్లి వినోద్ చౌహాన్‌కు ఇచ్చాం’’ అని కూడా కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు స్టేట్మెంట్ ఇచ్చారని ఈడీ వాదిస్తోంది. ఇలా తనకు అందిన డబ్బులన్నీ హవాలా మార్గంలో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వినోద్ చౌహాన్ అందజేశాడని ఈడీ అంటోంది. కవిత సహా పలువురు సభ్యులుగా ఉన్న సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపుల్లో దాదాపు రూ. 45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికలకే ఉపయోగించారని ఈడీ వాదిస్తోంది.



Next Story