- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీపోర్టేషన్ ప్రక్రియ పాతదే

- కొన్నేళ్లుగా అక్రమ వలసలపై అమెరికా కఠిన వైఖరి
- స్వదేశాలకు రప్పించడం ఆయా ప్రభుత్వాల బాధ్యతే
- నిబంధనల ప్రకారమే సంకెళ్లు
- మహిళలు, చిన్నారులను నిర్బంధించలేదు
- ఐఈసీ అధికారులు మాకు సమాచారం ఇచ్చారు
- రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రి జై. శంకర్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇది కొత్తదేమీ కాదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. అమెరికా 104 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇండియాకు పంపించిన విధానంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. వలసదారులకు సంకెళ్లు వేసి నిర్బంధించి పంపడంపై ప్రతిపక్ష ఎంపీలు చేస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి జై శంకర్ వివరణ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐఈసీ) ఈ డీపోర్టేషన్ ప్రక్రియ చేపట్టింది. నిబంధనల్లో భాగంగానే ఐఈసీ ఆ విమానాన్ని ఉపయోగించిందని జై శంకర్ అన్నారు. 2012 నుంచి ఐఈసీ ఈ ప్రక్రియను నిరంతరం చేపడుతోంది. అప్పటి నుంచి నిబంధనల్లో ఏ మార్పు రాలేదని మంత్రి వెల్లడించారు.
2012 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల్లో భాగంగా వారిని నిర్బంధించారు. మహిళలు, చిన్నారులను నిర్బంధించలేదని అమెరికా అధికారులు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. విమాన ప్రయాణ సమయంలో అక్రమ వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించలేదు. వారికి అవసరమైన ఆహారంతో పాటు ఇతర సౌకర్యలు కల్పించారు. అత్యవసర వైద్యం కూడా వారికి అందుబాటులో ఉంది. టాయిలెట్‌కు వెళ్లే సమయంలో అవసరమైతే వారి సంకెళ్లను తొలగించారని కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పారు. పౌర విమానాలు, చార్టెట్ ఫ్లైట్లలో కూడా అక్రమ వలసదారుల పట్ల ఇలాంటి నిబంధనలే అమలులో ఉంటాయని చెప్పారు. అమెరికా అమలు చేస్తున్న నిబంధనలు ఏ ఒక్క దేశానికో.. లేదంటే ఇండియాకో పరిమితం కాలేదు. ఏ దేశస్థులకు అయినా ఆ నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. అక్రమ వలసలను అరికట్టేందుకు మనం కూడా కఠినంగా వ్యవహరించాలి. తమ దేశస్థులు విదేశాల్లో ఉంటే వారిని స్వదేశానికి రప్పించడం ఆయా దేశాల బాధ్యతని అన్నారు.
అమెరికా ప్రతీ ఏటా కొన్ని వందల మంది అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి బహిష్కరిస్తోందని అన్నారు. 2009లో 743 మందిని 2010లో 799, 2011లో 597, 2012లో 530, 2013లో 515, 2024లో 591, 2015లో 708, 2016లో 1303, 2017లో 1024, 2018లో 1180. 2019లో 2042, 2020లో 1889, 2021లో 805, 2022లో 862, 2023లో 617, 2024లో 1368, 2025లో 104 మంది భారతీయులను అమెరికా డీపోర్ట్ చేసిందని సభకు తెలిపారు. ఈ లెక్కలు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నుంచి తెప్పించినవేనని అన్నారు. 2009 నుంచి 2019 మధ్య మరింత ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపిందని చెప్పారు. ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగు పడాలని భావిస్తున్నాము. ఇందులో వలసలే కీలక పాత్ర పోషించనున్నాయి. అక్రమ వలసల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు బలహీన పడతాయని అన్నారు. ప్రభుత్వం అక్రమ వలసలను అరికట్టి.. సక్రమైన మార్గాల్లో వలస వెళ్లేలా కృషి చేస్తుందని అన్నారు. లోక్‌సభలో అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు.