లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు

by S Gopi |
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) కీలక సూచనలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లను అడగొద్దని, భక్తులు, దైవ సంబంధ విషయాలను అవమానించవద్దని సూచించింది. ప్రచారంలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా, తప్పుడు ప్రకటనలు చేయకూడదని పేర్కొంది. వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధానంగా ఇదివరకు నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది. ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసం ఉపయోగించకూడదని, ప్రచార సమయంలో నైతిక బాధ్యతను కలిగి ఉండాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యర్థ పార్టీలను కించపరిచే విధంగా ఉండే పోస్టులు వేయకూడదు. వ్యక్తిగత దాడులు, విభజన వంటి వాటికి బదులుగా గౌరవప్రదమైన రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed