Trump: భారత్ ఆదర్శం.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు- ట్రంప్

by Shamantha N |
Trump: భారత్ ఆదర్శం.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు- ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో(US Elections) భారీ మార్పులకు రెడీ అయ్యారు. ఇప్పట్నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. కొత్తనియమాలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు. ‘‘ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో యూఎస్‌ విఫలమైంది. ఉదాహరణకు.. భారత్ (India), బ్రెజిల్‌ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్‌ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయి. కానీ, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోంది. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్‌ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయి. మన ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు మెయిల్-ఇన్ ఓటింగ్‌ను వ్యక్తిగతంగా ఓటు వేయలేని వారికి మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ఆ దేశాలు పోస్ట్‌మార్క్ తేదీతో సంబంధం లేకుండా ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించవు’’ అని ట్రంప్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇకపై అమెరికా పౌరసత్వం చూపించాల్సిందే..

ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఆర్డర్ల ప్రకారం.. ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే, యూఎస్‌ పాస్‌పోర్ట్‌ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. దీంతో పాటు ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను ట్రంప్‌ తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్‌ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చాలామంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్‌ లేదా మొయిల్‌ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఓటింగ్ వ్యవస్థల కోసం దాని మార్గదర్శకాలను సవరించాలని ఎన్నికల సహాయ కమిషన్‌ను ఆదేశించారు. ఇకపోతే, 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాతే ఎన్నికల విధానంపై ట్రంప్ అనేక సందేహాలు లేవెనత్తారు. ప్రస్తుతం, ఆ లోపాలు తొలగించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను తెచ్చారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed