వ్యక్తిగత లాభం కోసం జాతీయ ప్రయోజనాలను వదులుకోవద్దు.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

by vinod kumar |   ( Updated:2024-08-18 13:30:15.0  )
వ్యక్తిగత లాభం కోసం జాతీయ ప్రయోజనాలను వదులుకోవద్దు.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: వ్యక్తిగత, రాజకీయ స్వలాభం కోసం జాతీయ ప్రయోజనాలను వదులుకోవడం సరికాదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశ ప్రయోజనాలే ప్రధానం కాకపోతే పాలిటిక్స్‌లో ఏర్పడే భిన్నాభిప్రాయాలు దేశవ్యతిరేకంగా మారే అవకాశం ఉందన్నారు. లాంటి శక్తులను ప్రజలే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శరీర దాతల కుటుంబాల గౌరవార్థం ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ధన్‌ఖడ్ ప్రసంగించారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి ఎంతో ఘనైన చరిత్ర ఉందన్నారు. ఎన్నో రకాల అభిప్రాయాలు కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణమని తెలిపారు. భారతీయత మన గుర్తింపు కాబట్టి జాతీయ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని పిలుపునిచ్చారు.

భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి ఎవరూ ఊహించలేదని కొనియాడారు. ఇటీవలి ఎన్నికలతో చీకటి అధ్యాయం ముగిసిందని కొందరు అంటున్నారని, వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారికి కూడా తెలియదన్నారు. అవయవ దానం మానవ స్వభావానికి అత్యున్నత నైతిక నిదర్శనమని, అందుకు పౌరులు కృషి చేయాలని సూచించారు. అవయవ దానాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం, బలహీనులను దోపిడీ చేసే సాధనంగా అనుమతించలేమని నొక్కి చెప్పారు. కాగా, జైన్ సోషల్ గ్రూప్స్ సెంట్రల్ సంస్థాన్, జైపూర్, ఢిల్లీలోని దధీచి దేహ్ దాన్ సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

Advertisement

Next Story

Most Viewed