సెక్యులరిజం‌ను ఒక జోక్‌లా మార్చేసిన ఇండియా కూటమి : దేవెగౌడ

by Hajipasha |   ( Updated:2024-03-09 12:09:59.0  )
సెక్యులరిజం‌ను ఒక జోక్‌లా మార్చేసిన ఇండియా కూటమి : దేవెగౌడ
X

దిశ, నేషనల్ బ్యూరో : లౌకికవాదాన్ని ఒక జోక్‌గా మార్చిన వర్గాల నెలవు ఇండియా కూటమి అని జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఒకప్పుడు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తండ్రి, మాజీ సీఎం కరుణానిధి ఆరేళ్లు కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని దేవెగౌడ చెప్పారు. కరుణానిధి అల్లుడు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారని తెలిపారు. ఇప్పుడవే టీఎంసీ, డీఎంకేలు సెక్యులరిజం నినాదాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో కుహనా సెక్యులరిజాన్ని అద్దంపట్టే ఇలాంటి ఇంకెన్ని ఉదాహరణలనైనా తాను చెప్పగలనని దేవెగౌడ తెలిపారు. జనతాదళ్ (సెక్యులర్), బీజేపీతో చేతులు కలపడాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. వాళ్లు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేవలం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ, జేడీ(ఎస్)ల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాపై తమ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed