CBI విచారణ వేళ డిప్యూటీ సీఎం సంచలన ట్వీట్..

by Satheesh |
CBI విచారణ వేళ డిప్యూటీ సీఎం సంచలన ట్వీట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా నేడు సీబీఐ ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా విచారణకు హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి సిసోడియా చేరుకోనున్నారు. ఇందుకోసం ఆయన ఉదయం 10 గంటలకు కాస్త ముందుగానే తన నివాసం నుంచి బయలుదేరారు. పార్టీ మద్దతుదారులతో ర్యాలీగా బయలుదేరారు. సీబీఐ ఆఫీసుకు వెళ్లడానికి ముందు మహాత్ముడి స్మృతివనం రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నట్లు సిసోడియా తెలిపారు.

ఇప్పటికే ఒకసారి సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ.. ఆ తర్వాత విచారణలో పలువురిని ప్రశ్నించింది. గత విచారణ అనంతరం వచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ మరోసారి ప్రశ్నించనుంది. సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సివచ్చినా.. నేను లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో నేడు సీబీఐ సిసోడియాను అరెస్టు చేయవచ్చనే ప్రచారం జోరందుకొంది. సీబీఐ ముందుకు సిసోడియా వెళుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ట్వీట్ చేశారు. ‘దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీశ్. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీపై ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లాల్సి రావడం శాపం కాదు, గౌరవం. నువ్వు జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తా’ అంటూ ట్వీట్ చేశారు.

ఆప్ నేతలు హౌస్ అరెస్ట్

సిసోడియా సీబీఐ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలో పోలీసులు భద్రతను పెంచారు. సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఆందోళన చేస్తారన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులతో పాటు.. పారామిలటరీ బలగాల బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో పలువురు ఆప్ నేతలను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, సిసోడియాను అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతుండడంతో ఆప్ నేతలు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed