IC 814: The Kandahar Hijack : సిరీస్ నిర్మాతలకు కాపీ రైట్ నోటీసులు

by Ramesh Goud |   ( Updated:2024-09-09 10:43:49.0  )
IC 814: The Kandahar Hijack : సిరీస్ నిర్మాతలకు కాపీ రైట్ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐసీ 814 ది కాందహార్ హైజాక్ నిర్మాతలపై ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ హైకోర్టు కాపీరైట్ నోటీసులు పంపింది. దీనిపై రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నిర్మాతలను ఆదేశించింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ది కాందహార్ హైజాక్ సిరీస్ లో లైసెన్స్ లేకుండా నాలుగు సీన్లను ఉపయోగించారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఏఎన్ఐ ఫిర్యాదు ప్రకారం, ప్రదర్శనలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, జనరల్ పర్వేజ్ ముషారఫ్, ఉగ్రవాదులు మసూద్ సహా ఇతరులను ఎలాంటి లైసెన్స్ లేకుండా చూపించే ఫుటేజీ సహా నాలుగు సీన్లతో పాటు తమ లోగోను కూడా ఉపయోగించారని అన్నారు. 2021 సంవత్సరంలో తమ ఫుటేజీని ఉపయోగించామని సినీ నిర్మాత తమను సంప్రదించారని, అయితే ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది చెప్పారు.

ఏఎన్ఐ ఫుటేజీని ఉపయోగించిన షోలోని నాలుగు ఎపిసోడ్‌లను తప్పనిసరిగా తీసివేయాలని, అంతేగాక లోగోను అస్పష్టం చేయాలని అతను చెప్పాడు. చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాది ఈ వాదనను తోసిపుచ్చారు. నిర్మాతలలో ఒకరి తరఫు న్యాయవాది హిరేన్ కమోద్ వాదిస్తూ, షోలో ఉపయోగించిన వాస్తవ వార్తల ఫుటేజీని కాన్సెప్టువల్, వైల్డర్‌నెస్ అనే మరో రెండు సంస్థల ద్వారా పొందామని, దానికి రూ.1.75 కోట్లు చెల్లించామని చెప్పారు. ఏఎన్ఐ వాటాదారు సంస్థ అయిన రాయిటర్స్ ఈ ఫుటేజీలను ఇతర సంస్థలకు ఇచ్చిందని, షో నిర్మాతలు వారితో ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సిరీస్ నిర్మాతలకు కాపీరైట్ నోటీసులు పంపింది. అంతేగాక ఈ పిటీషన్ పై రెండు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని మ్యాచ్‌బాక్స్ షాట్స్, బెనారస్ మీడియావర్క్స్, నెట్‌ఫ్లిక్స్‌లను ఆదేశించింది.

Advertisement

Next Story