కేంద్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది: సుప్రీంకోర్టు

by Harish |
కేంద్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ వన్ ర్యాంక్- వన్ పెన్షన్ బకాయిల చెల్లింపులను విడతల వారీగా చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇలాంటి చర్యలతో కేంద్ర మంత్రిత్వ శాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుందని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జేబీ పార్థివాలాతో కూడిన బెంచ్ పేర్కొంది. వెంటనే జనవరి 20న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరింది. నాలుగు విడతల్లో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) బకాయిల చెల్లింపుపై కమ్యూనికేషన్ జారీ చేయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోదని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది.

మాజీ సైనికులకు ఓఆర్‌ఓపీ బకాయిలను కేంద్రం ఒక విడత చెల్లించిందని, అయితే తదుపరి చెల్లింపుల కోసం మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న ఇచ్చిన కమ్యూనికేషన్ తన తీర్పుకు పూర్తిగా విరుద్ధమని, నాలుగు వాయిదాల్లో ఓఆర్‌ఓపీ బకాయిలను చెల్లిస్తామని ఏకపక్షంగా చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది.

చెల్లింపుల పరిమాణం, అవలంబించాల్సిన పద్ధతులు, బకాయిల చెల్లింపుకు ప్రాధాన్యతా విభాగం ఏది అనే వివరాలను తెలియజేస్తూ నోట్‌ను సిద్ధం చేయాలని అటార్నీ జనరల్‌ను కోరింది. ఏదో రకమైన వర్గీకరణ జరగాలని, వృద్ధులకు ముందుగా బకాయిలు చెల్లించాలని మేము కోరుకుంటున్నామని తెలిపింది. ఈ అంశంపై చర్చ ప్రారంభమైన తర్వాత నుండి ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా పెన్షనర్లు మరణించారని అని బెంచ్ పేర్కొంది.

అంతకుముందు మార్చి 15లోగా పూర్తి బకాయిలు చెల్లించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు గడువిచ్చింది. అయితే జనవరి 20న కేంద్రం విడతల వారీగా చెల్లింపులు చేస్తామని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ మాజీ సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed