- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IAS Study Circle : ‘ఢిల్లీ కోచింగ్ సెంటర్’ వ్యవహారం.. ఇద్దరు అరెస్ట్.. మూడు కోచింగ్ సెంటర్లు సీజ్
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్‌లోకి వరదనీరు ముంచెత్తడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను రాజిందర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వక హత్య, నిర్లక్ష్యం అభియోగాలతో వారిపై కేసును నమోదు చేశారు. ఈనేపథ్యంలో రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషాదఘటనపై పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తునకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది. నిజానిజాలు వెలుగుచూడాలనే తాము కూడా కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థులు తాన్యా సోనీ, నివిన్ డాల్విన్, శ్రేయా యాదవ్‌ల కుటుంబ సభ్యులు, ఆప్తులకు రావూస్ స్టడీ సర్కిల్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.
ఒకే ఎంట్రీ.. ఒకే ఎగ్జిట్.. ఆపై బయోమెట్రిక్ ఉండటం వల్లే..
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలిపిన నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) స్పందించింది. ఢిల్లీలో బేస్మెంట్లలో నిర్వహిస్తున్న 8 కోచింగ్ సెంటర్లను గుర్తించి, వాటిలో మూడింటికి సీల్ వేశామని ఎంసీడీ అడిషనల్ కమిషనర్ తారిఖ్ మసూద్ వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం లభిస్తుందన్నారు. దీనిపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన విషయాన్ని గుర్తుచేశారు. కారకులైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని తారిఖ్ స్పష్టం చేశారు. ‘‘బేస్మెంట్ నుంచి బయటికి వచ్చేందుకు రెండో ప్రత్యామ్నాయ మార్గం ఉండి ఉంటే.. ఆ ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలతో బయటపడి ఉండేవారు. రావూస్ స్టడీ సర్కిల్ వాళ్లు అక్రమంగా బేస్మెంట్‌లో లైబ్రరీ నిర్వహిస్తున్నారు. దానిలోకి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా అభ్యర్థులు ఆ లైబ్రరీకి వెళ్లి వస్తుండేవారు. వరద నీరు బేస్మెంటులోకి రావడంతో బయోమెట్రిక్ వ్యవస్థ స్తంభించింది. దీంతో విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయి నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు’’ అని తారిఖ్ మసూద్ వివరించారు.