ఆ హత్యాచార దోషులకు మూడు నెలల్లో ఉరి పడాలి: సీఎం మమతా బెనర్జీ

by Mahesh Kanagandla |
ఆ హత్యాచార దోషులకు మూడు నెలల్లో ఉరి పడాలి: సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. ఇదే తరుణంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలో పదేళ్ల బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా సీఎం మమతా బెంగాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ దోషులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

‘కుల్తులి కేసులో పోక్సో యాక్ట్ కూడా చేర్చాలని పోలీసులను కోరుతున్నాను. దోషులను వీలైనంత తొందరగా పట్టుకోవాలి. మూడు నెలల్లో వారికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోండి. నేరం ఎవరు చేసినా నేరమే. దానికి కులం, మతం, వర్ణం లేదు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రేప్ కేసులకు సంబంధించి మీడియా ట్రయల్స్ మానుకోవాలని, అవి పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. దుర్గా పూజా కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ప్రారంభించిన తర్వాత కోల్‌కతా పోలీసు బాడీ గార్డ్ లైన్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం పదేళ్ల బాలిక మృతదేహం కనిపించింది. రేప్ చేసి చంపేసి ఉంటారని అనుమానాలున్నాయి. ఈ హత్యాచార ఘటనపై స్థానికుల ఆగ్రహంతో.. ఓ పోలీసు ఔట్‌పోస్ట్‌కు, అక్కడ పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు.

Advertisement

Next Story