చైనా ముందు కాలుమోపితే చంద్రుడిపై ఆక్రమణలే..

by S Gopi |
చైనా ముందు కాలుమోపితే చంద్రుడిపై ఆక్రమణలే..
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా అంతరిక్ష పరిశోధనలపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా హెడ్ బిల్ నెల్సన్ సందేహాలు వ్యక్తం చేశారు. చైనా తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అందుకు సంబంధించిన సైనిక ఆపరేషన్ల విషయాలను దాచిపెడుతున్నట్టు వాషింగ్టన్‌లోని చట్టసభ సభ్యులకు తెలిపారు. 2025 ఏడాదికి సంబంధించి నాసా బడ్జెట్ కేటాయింపులపై అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీ ముందు హాజరైన బిల్ నెల్సన్.. 'చైనా ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంతరిక్ష రంగంలో అసాధారణమైన పురోగతిని సాధించింది. అవి చాలా రహస్యంగా ఉన్నాయి. పౌర కార్యక్రమాల పేరుతో సైనిక ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నాం. అమెరికా కూడా అంతే స్థాయిలో పోటీనిస్తుంది. చంద్రుడిపైకి వెళ్లడం ప్రస్తుతం తమపై ఉన్న బాధ్యత. తమ ఆందోళన ఏమిటంటే ఒకవేళ చైనా అక్కడకు ముందుగా వెళ్తే అది తమ ప్రదేశమని, మీకు స్థానం లేదనే అవకాశం ఉంది. అంతరిక్ష రంగంలో ఎదిగేందుకు చైనా డబ్బును వెదజల్లుతోంది, బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేపడుతోందనే విషయాన్ని గుర్తించాలి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలని' బిల్ నెల్సన్ సభ్యులకు వివరించారు. మన భద్రతను తగ్గించుకోకపోవడమే మంచిదని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా, నాసా చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం జాబిల్లిపై నాసా అర్టెమిస్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. తద్వారా దాదపు ఐదు దశాబ్దాల తర్వాత మనిషిని చంద్రుడిపైకి పంపనుంది. ఇదివరకే ఆర్టెమిస్-1 పంపగా, భవిష్యత్తులో ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3లను ప్రయోగించనుంది. ఇటీవల మూన్ ల్యాండింగ్ మిషన్ ఆర్టెమిస్-3 సెప్టెంబర్ 2026కి వాయిదా పడింది.

Advertisement

Next Story