చంద్రునిపై ల్యాండింగ్ దిశగా చంద్రయాన్-4 మొదటి అడుగు: ఇస్రో చీఫ్

by S Gopi |
చంద్రునిపై ల్యాండింగ్ దిశగా చంద్రయాన్-4 మొదటి అడుగు: ఇస్రో చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించి చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. చంద్రయాన్ ప్రోగ్రామ్ తదుపరి అభివృద్ధి దశలో ఉందని, ఈ విషయంలో మనదేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సోమనాథ్.. చంద్రయాన్-4 అనేది చంద్రయాన్ సిరీస్‌కు కొనసాగింపుగా అభివృద్ధి దశలో ఉంది. 2040వ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని ఆయన అన్నారు. నిర్దేశించిన సమయానికి మనం చంద్రుడిపై అడుగుపెడతామని, ఇది జరిగేందుకు వివిధ రకాల పద్దతిలో చంద్రుడి గురించి అన్వేషణ కొనసాగించాలన్నారు. ఈ దశలో చంద్రయాన్-4 మొదటి అడుగు. చంద్రుడిపై క్రాఫ్ట్ అడుగు పెట్టాక అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఇదే సమయంలో రాకెట్, శాటిలైట్ ప్రాజెక్టుల నుంచి టెక్నాలజీ డెవలప్‌మెంట్ వరకు అనేక ఇతర ప్రాజెక్టులపై కూడా ఇస్రో పనిచేస్తోందని సోమనాథ్ వివరించారు. భారత్ చేపట్టిన్ మరొక ప్రధాన మిషన్ గగన్‌యాన్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురిని భూమి చుట్టూ దాదాపు 400 కిలోమీటర్లున్న వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఒకటి నుంచి మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. కక్ష్యలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు.

Advertisement

Next Story