జవాన్ల శవపేటిక మోసిన సీఎం.. మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |
జవాన్ల శవపేటిక మోసిన సీఎం.. మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దంతెవాడలో మావోయిస్టుల ఘాతుకానికి బలైన జవాన్ల ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలచివేసింది. గురువారం ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌‌బఘేల్‌ మృతులకు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా సీఎం ఓ శవపేటికను మోశారు. అనంతరం జవాన్ల మృతదేహాలను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలించారు. ఆ వాహనం వరకు ఆయన జవాన్ల శవపేటికలను తీసుకెళ్లారు. ఈ క్రమంలో జవాన్ల కుటుంబసభ్యుల రోదనలు ఆకాశన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేస్తూ శవపేటికలను స్వస్థలాలకు తరలించారు.

ఈ సందర్భంగా సీఎం బఘేల్ మాట్లాడుతూ.. ‘జవాన్ల త్యాగాలు వృథాగా పోవు. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు జరుపుతోన్న పోరును మరింత తీవ్రం చేస్తాం’ అని వెల్లడించారు. కాగా, బుధవారం ఉదయం డీఆర్జీ జవాన్లు కూంబింగ్‌ నిర్వహించి వెళుతుండగా.. రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబులను మావోలు పేల్చారు. ఈ పేలుడు దాటికి మినీ బస్సు తునాతునకలైంది. ఈ ఘటనలో బస్సులోని 13 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed