Brij Bhushan : బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ షురూ

by Hajipasha |
Brij Bhushan : బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ షురూ
X

దిశ, నేషనల్ బ్యూరో : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ అసోసియేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బ్రిజ్ భూషణ్ స్వస్థలం గోండాకు వెళ్లిన ఢిల్లీ పోలీసులు.. దీపక్ సింగ్, సుబేదార్ యాదవ్‌లకు చెందిన రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.

ఆ ఫోన్లు గత ఏడాది కాలంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లోనే ఉన్నాయి. ఈనేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ ముకేశ్ కుమార్ వాంగ్మూలం నమోదు తేదీని వాయిదా వేస్తూ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రియాంకా రాజ్‌పుత్ ఆదేశాలు జారీ చేశారు. వాంగ్మూలం సమర్పించాలంటూ ఈ కేసులోని ఒక బాధితురాలు, ఒక సాక్షికి(రష్మి) సమన్లు ​​జారీ చేశారు. బాాధితురాలు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకోకుంటే.. ప్రత్యేక గదిలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని న్యాయమూర్తి నిర్దేశించారు. తదుపరి విచారణ ఆగస్టు 6కు వాయిదా వేశారు.



Next Story