దద్దరిల్లిన పార్లమెంట్.. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా

by Satheesh |
దద్దరిల్లిన పార్లమెంట్.. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అదానీ అంశాలపై విపక్షాల పట్టుతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. దీంతో కార్యకలాపాలు కొనసాగించే వీలు లేకపోవడంతో లోక్ సభ సాయంత్రం 4 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు లోక్ సభలో అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నల్లరంగు దుస్తులతో పార్లమెంట్ కు హాజరయ్యారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరేశారు.

పోటాపోటీ సమావేశాలు:

రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు ఏకం అవుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి గతానికి భిన్నంగా టీఎంసీ సైతం హాజరుకావడం ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ, అదానీ ఇష్యు నేపథ్యంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విషయంలో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రభుత్వం విపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదని, నిజం మాట్లాడే వారిని జైలులో వేసే ప్రయత్నం జరుగుతోందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది.

బీజేపీ అలర్ట్:

విపక్షాలు ఒక్కతాటిపైకి వస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. విపక్షాల వ్యూహాలను ఎదుర్కొనే అంశంపై చర్చించారు. పార్లమెంట్‌లో జరిగిన పోటాపోటీ సమావేశాలతో రాజకీయం మరింత వేడెక్కింది.

Advertisement

Next Story

Most Viewed