Arvind Kejriwal: సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదు.. కేజ్రీవాల్ పై బీజేపీ విమర్శలు

by Shamantha N |
Arvind Kejriwal: సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదు.. కేజ్రీవాల్ పై బీజేపీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ షరతులతో బెయిల్‌ వచ్చారని.. ఆయనకు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయలేనప్పుడు సీఎంగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను సుప్రీంకోర్టు చట్టబద్ధమైందని పేర్కొందని గుర్తుచేశారు. ఆయనపై అభియోగాలు చెల్లుబాటు అవుతాయని చెప్పిందన్నారు. కేజ్రీవాల్‌కి షరతులతో కూడిన బెయిల్‌ రావడం పెద్ద విశేషం కాదని.. విచారణ అయితే కొనసాగుతుందన్నారు. త్వరలోనే ఆయనకు శిక్ష పడుతుందన్నారు. జయలలిత, లాలూ యాదవ్‌, మధుకోడా వంటి సీఎంల జాబితాలో కేజ్రీవాల్‌ చేరారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినా మళ్లీ శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లే అవకాశం ఉందని సీఎం గుర్తుంచుకోవాలన్నారు.

అప్పట్లో జైలుకెళ్లిన.. ఇప్పుడు బెయిల్ పొందిన సీఎం

బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. అవినీతిపరుడైన కేజ్రీవాల్‌కు షరతులతో బెయిల్‌ లభించిందని విమర్శించారు. ఆయన ఇంతకుముందు జైలుకెళ్లిన సీఎం అని.. కానీ ఇప్పుడు బెయిల్‌ పొందిన సీఎం అయ్యాడు అని చురకలు అంటించారు. ఆయన తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. కానీ, కేజ్రీవాల్ అలా చేయడని.. ఆయనకు నైతికత కూడా లేదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించినా, రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు. ఆయనపై ఆరోపణలు చేయడం తప్పేం కాదని.. ఆయన ప్రస్తుతం నిందితుల కేటగిరిలో ఉన్నారని విమర్శించారు.

Advertisement

Next Story