బీజేపీ కంట్రోల్‌లో ఎలక్షన్ కమిషన్: రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

by Mahesh Kanagandla |
బీజేపీ కంట్రోల్‌లో ఎలక్షన్ కమిషన్: రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం.. బీజేపీ కంట్రోల్‌లోనే ఉన్నదని, ఆ మాటకొస్తే సీబీఐ, ఈడీ, ఐటీ సహా ఉద్యోగస్వామ్యమంతా వారి నియంత్రణలోనే ఉన్నదన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యాక రాహుల్ గాంధీ తొలిసారి ఆ రాష్ట్రం పర్యటించారు. రాజధాని రాంచీలో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా అందరూ దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది’ అని రాహుల్ ఆరోపణలు గుప్పించారు. ‘ప్రధాని మోదీ దళితులను, ఆదివాసీలను, వెనుకబడిన తరగతులను గౌరవిస్తానని చెబుతారు. వారి హక్కులను హరిస్తారు. ఆయన మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ, అనేక వ్యవస్థల నుంచి మిమ్మల్ని బయటికి తరిమేస్తారు.’ అని పేర్కొన్నారు. ట్రైబల్స్‌ను వనవాసీ అని బీజేపీ నాయకులు పలకడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ట్రైబల్స్‌ను బీజేపీ నాయకులు వనవాసి అని పిలవడం వెనుక ఆంతర్యమేంటీ? వారు మీ జీవిత విధానాన్ని, గొప్ప చరిత్రను, మీ విజ్ఞానాన్ని ఒక్క మాటతో తుడిచిపెట్టే పని చేస్తున్నారు. ఆదివాసీ అంటే మీరు తొలి నివాసులు అని అర్థం. అదే వనవాసీ అంటే అడవిలో జీవించేవారని అర్థం. కాబట్టి, వారు వనవాసి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఒక పదం కాదని, మీ చరిత్ర మొత్తానికి సంబంధించిన పదం’ అని రాహుల్ గాంధీ వివరించారు. ‘మన విద్యా వ్యవస్థలో ఎక్కడా ఆదివాసీల ప్రస్తావన ఉండదు. 10 నుంచి 15 లైన్లకు మించి వారి గురించిన సమాచారం ఉండదు. మిమ్మల్ని ఓబీసీలు అని పిలుస్తారు. మీరు బ్యాక్‌వర్డ్ అని ఎవరు అన్నారు? మీకు దక్కాల్సింది దక్కడం లేదు. ఈ దేశాన్ని నిర్మించిన కర్షకులు, కార్మికులు, వడ్రంగి, మంగళి, చెప్పులు కుట్టేవారి చరిత్ర ఎక్కడ ఉన్నది? ’ అంటూ రాహుల్ గాంధీ ఉద్వేగంగా మాట్లాడారు.

Advertisement

Next Story