- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంకే స్టాలిన్‌పై రూ.1,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఆరోపణలు

- టాస్మాక్ ద్వారా అవకతవకలకు పాల్పడ్డారన్న బీజేపీ
- ఈడీ దర్యాప్తుతో పలు లావాదేవీలు బయపడ్డాయన్న బీజేపీ
- నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఏఐడీఎంకే డిమాండ్
- ఆరోపణలను ఖండించిన డీఎంకే
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై బీజేపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేసింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)ను అడ్డం పెట్టుకొని రూ.1,000 కోట్ల లిక్కర్ స్కామ్‌కు పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల్లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని, భారీగా ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని బీజేపీ తెలిపింది. లిక్కర్ స్కామ్ బయటపడుతుందనే అనుమానంతోనే కొత్త విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని ఖండిస్తూ, ఇతర అంశాలను కూడా తెరపైకి తీసుకొని వచ్చారని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే బీజేపీ చేస్తున్న లిక్కర్ స్కామ్ ఆరోపణలను అధికార డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది.
2025-26కు సంబంధించి తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే డీఎంకే ప్రభుత్వంపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు బయటకు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీగా నిధులను కేటాయించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగకల్పన, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా బడ్జెట్‌లో ఉన్నాయి. అయితే ఫైనాన్స్ మినిస్టర్ తంగమ్ తెనరసు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలోనే ప్రతిపక్ష అన్నాడీఎంకే సభను అడ్డుకుంది. లిక్కర్ స్కామ్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, సభలో చర్చ జరగాలని పట్టుబట్టింది. అయితే అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో.. అన్నాడీఎంకే సభను వాకౌట్ చేసింది. లిక్కర్ స్కామ్, ఇతర అవినీతి ఆరోపణలపై డీఎంకే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి, సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ఎడిపాడి పళనిస్వామి డిమాండ్ చేశారు.
బీజేపీ నేత అమిత్ మాలవియా కూడా లిక్కర్ స్కామ్‌పై 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈడీ దాడులు, లిక్కర్ స్కామ్ వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం స్టాలిన్ త్రిభాషా పాలసీని, కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ.. వాటిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఈపీ, డీలిమిటేషన్, బడ్జెట్ డాక్యుమెంట్ల నుంచి రూపాయి సింబల్ తొలగింపు వంటి అంశాల ద్వారా ఈడీ దాడుల్లో వెల్లడైన విషయాలపై ప్రజల దృష్టిని మరలుస్తున్నారని అన్నారు. ఈడీ వెలికితీసిన డాక్యుమెంట్లలో లెక్కల్లో లేని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని.. దాదాపు రూ.1,000 కోట్లు లంచాల ద్వారా డిస్టిలరీలు కొంత మంది వ్యక్తులకు చెల్లించినట్లు తెలిసిందని మాలవియ ఆరోపించారు. సీఎం స్టాలిన్ ఈ డబ్బు ఎవరెవరికి అందిందో తెలియజేయాలని మాలవియ డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ కూడా తమిళనాడు స్పీకర్‌కు లేఖ రాశారు. రూల్ 55 ప్రకారం ఈడీ దర్యాప్తు, టాస్మాక్ వద్ద లభించిన అక్రమ చెల్లింపులపై ప్రభుత్వం స్పందన చెప్పాలని ఆయన లేఖలో కోరారు. టెండర్లను మానిప్యులేట్ చేయడం ద్వారా రూ.1,000 కోట్ల చేతులు మారినట్లు ఆయన ఆరోపించారు.
కాగా, టాస్మాక్‌లో భారీగా అవకతవకలు జరిగిన విషయాన్ని తమిళనాడు ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీ ఖండించారు. టాస్మాక్‌లో అవినీతి జరిగేందుకు ఆస్కారామే లేదని ఆయన చెప్పారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసింది. కానీ ఏ ఏడాదిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో పేర్కొనలేదని ఆయన అన్నారు. టాస్మాక్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకల పేరిట కేసు నమోదు చేసిన ఈడీ.. ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూసిందన్నారు. నాలుగేళ్లుగా బార్ల టెండర్లు ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నామని.. కానీ వాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ.1,000 కోట్ల స్కామ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెంథిల్ బాలాజీ అన్నారు.