గత పదేళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే : ప్రధాని మోడీ

by Hajipasha |
గత పదేళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన అభివృద్ధి అనేది ట్రైలర్ మాత్రమేనని.. రానున్న రోజుల్లో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేయాల్సింది చాలా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను లాభదాయక సంస్థలుగా మార్చినందుకు ఆర్‌బీఐని ఆయన ప్రశంసించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 90వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘2014లో ఆర్‌బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నేను హాజరైనప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఆ సమయానికి భారతదేశ బ్యాంకింగ్ రంగం మొత్తం సమస్యలు, సవాళ్లతో పోరాడుతోంది. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తు గురించి అప్పట్లో అందరూ సందేహం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనది, స్థిరమైనదిగా పేరు తెచ్చుకుంది’’ అని ఆయన వివరించారు.

రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చి బ్యాంకులను నిలబెట్టాం

ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం అప్పట్లో 3.5 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. తాము చేపట్టిన చర్యలు ఫలించి 2018 నాటికి 11.25 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ).. 2023 సెప్టెంబర్ నాటికి 3 శాతానికి తగ్గిపోయాయన్నారు. రానున్న కాలంలో పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు బ్యాంకులు తగినంత రుణ మద్దతును అందించాలని ప్రధాని కోరారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యాజమాన్యంలో బ్యాంకుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలనే కోణంలోనే పరోక్షంగా ప్రధాని ఈ కామెంట్ చేశారనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఆర్థికవేత్త, 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగరియా, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖరా, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల సీఈవోలు, తదితరులు పాల్గొన్నారు.

రూ.90 నాణెం విడుదల.. విశేషాలివీ

ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రూ.90 నాణేన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ కాయిన్‌ను 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీని బరువు 40 గ్రాములు. ఈ నాణెంపై ఆర్‌బీఐ చిహ్నం, లోగో కింద RBI@90 అని రాసి ఉంది. అశోక స్తంభానికి నాలుగు సింహాల చిహ్నం ఉంది. దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంది. ఈ నాణెం ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు.

Advertisement

Next Story