ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

by Javid Pasha |
ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో 125 అడుగుల డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత గడువు ప్రకారంగానే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు.

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర నలుగురు మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలోని స్టుడియోను సందర్శించి అక్కడ జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించింది.

ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రూ.268 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఖర్చు ఎంతగా పెరిగినప్పటికీ స్మృతివనం పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతోందని మంత్రి మేరుగ నాగార్జున వివరించారు.

Advertisement

Next Story