Women's Reservation Bill: బిల్లు అమలులో మరో ట్విస్ట్! ఆ షరతుతో కన్‌ఫ్యూజన్?

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-19 08:54:37.0  )
Womens Reservation Bill:  బిల్లు అమలులో మరో ట్విస్ట్! ఆ షరతుతో కన్‌ఫ్యూజన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ఈ రోజు బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, లోక్‌సభలకు జరిగే ఎన్నికల్లో మహిళలకు 33% (మూడింట ఒక వంతు) సీట్లను రిజర్వు చేసేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఈ సీట్లను రొటేషన్ పద్ధతిలోనే అమలు చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

నిర్దిష్టంగా ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను రిజర్వు చేసిన తరహాలో కాకుండా రొటేషన్ పద్ధతిలో అని (క్లాజ్ నెం. 5-3)లో పేర్కొనడంతో ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో సెగ్మెంట్ మహిళలకు మారే అవకాశమున్నది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభతో పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి సైతం వర్తించనున్నట్లు ఆ బిల్లులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

యూపీఏ హయాంలో రాజ్యసభలో (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు పాస్ అయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదన్న అంశాన్ని పేర్కొన్న కేంద్ర మంత్రి... ఫ్రెష్ బిల్లుగానే దీన్ని ఈ సెషన్‌లో ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. అందువల్లనే రాజ్యాంగానికి 128వ సవరణ బిల్లు పేరుతో దీన్ని ప్రస్తుత పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టారు. తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

డీలిమిటేషన్ తర్వాతనే...? :

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ (క్లాజ్ నెం. 5-4లో) మంత్రి ఆ బిల్లులో పేర్కొన్నారు. ఇప్పుడు బిల్లులోని ఈ అంశమే సరికొత్త సందేహాలకు కారణమవుతున్నది. లోక్‌సభ, అసెంబ్లీల ప్రస్తుత కాలపరిమితి (గడువు) ముగిసిన తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పడంతో ఈలోపే అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లయితే వాటికి మహిళా రిజర్వేషన్ వర్తించదనే అభిప్రాయం నెలకొన్నది. లోక్‌సభ గడువు మే నెలలో పూర్తి కానున్నందున ఇకపైన జరిగే ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తోనే వర్తించనున్నట్లు బిల్లులో స్పష్టత ఉన్నప్పటికీ డీలిమిటేషన్ షరతు కారణంగా గందరగోళం నెలకొన్నది.

More News : మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి.. దాని చరిత్ర ఇదే..

Advertisement

Next Story