Hindu temple in California: మరో హిందూ దేవాలయంపై దాడి.. ఈసారి ఎక్కడంటే?

by D.Reddy |
Hindu temple in California: మరో హిందూ దేవాలయంపై దాడి.. ఈసారి ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలోనే కాదు, బంగ్లాదేశ్, కెనడా, అమెరికా.. ఇలా ఇతర దేశాల్లో ఉన్న హిందూ ఆలయాలను కూడా లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. తాజాగా అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న ప్రసిద్ధ శ్రీ స్వామినారాయణ మందిరం గోడలపై దుండగులు.. భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) ఎక్స్‌లో తెలిపింది. అమెరికాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఈ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రార్థనా స్థలాలకు భద్రత పెంచాలని కోరింది.

ఈ సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జైస్వాల్ స్పందించారు. చినో హిల్స్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించారని BAPS శనివారం తెలిపింది. 'ఇలాంటి హేయమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులను కోరుతున్నాం' అని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

కాగా, గత ఏడాది కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిరం, న్యూయార్క్‌లోని BAPS మందిరంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ ఘటనల్లో దేవాలయాల గోడలపై 'హిందువులు వెనక్కి వెళ్లండి' వంటి హిందూ వ్యతిరేక సందేశాలు కనిపించాయి. ఇది అమెరికాలోని భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై అమెరికా అధికారులు గట్టిగా స్పందించాలని భారత అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed