US President: శతాబ్దాలుగా 'మహిళా అధ్యక్షురాలి'ని ఎన్నుకోలేకపోతున్న అమెరికా

by S Gopi |
US President: శతాబ్దాలుగా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోలేకపోతున్న అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మహిళల సారథ్యం గురించి చర్చలు జరిగాయి. చాలా దేశాల్లో మహిళలే నాయకత్వం వహించి సత్తా చాటుకున్నారు. అయితే, అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఇందుకు నోచుకోవడంలేదు. దీంతో అమెరికా మహిళాధినేత కోసం వేచి చూస్తోంది. దాదాపు రెండున్నర శతాబ్దాల నుంచి అమెరికా ప్రజాస్వామ్యంలో మహిళా అధ్యక్షురాలు లేదు. ఏళ్లుగా మహిళలు ఈ పీఠం కోసం పోటీ పడుతున్నప్పటికీ విజయం దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన కమలా హ్యారీస్ విజయానికి కొంత దూరంలో నిలిచారు. మునుపటి కంటే ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు పోటీ గట్టిగా ఇచ్చినప్పటికీ అధికారాన్ని పొందలేకపోయారు.

తాజాగా అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. దీంతో అమెరికా మరికొంతకాలం మహిళాధినేత కోసం వేచి ఉండాల్సి ఉంది. ఆశ్చర్యకరంగా 2016లో సైతం ట్రంప్ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను ఓడిచి మొదటిసారి వైట్‌హౌస్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకు ఆశాజ్యోతిగా నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటున్న దేశం ఇప్పటికీ మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోకపోవడం కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. అమెరికా మహిళలు.. స్త్రీల హక్కుల ఉద్యమాలలో ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. అయినప్పటికీ, చెల్లింపులతో కూడిన ప్రసూతి సెలవులు లేదా వేతనంతో కూడిన కుటుంబ సెలవులకు చట్టపరమైన హక్కు లేని ఏకైక అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఉంది. ఆ దేశ మహిళలు ఉన్నత జీవన ప్రమాణాలను కలిగి ఉన్నప్పటికీ, యూఎస్‌కు ఇంకా మహిళా ప్రధాన న్యాయమూర్తి లేదా సెనేట్ మెజారిటీ నాయకురాలు లేరు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం సైతం తక్కువగానే ఉంది.

హిల్లరీ క్లింటన్, కమలా హ్యారీస్..

2016, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, కమలా హ్యారీస్ ఎన్నికల వరకూ వచ్చి అధ్యక్ష పదవికి దూరమయ్యారు. 2016లోనూ డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కాగా, 30 లక్షల ఓట్లతో గెలిచారు. ఈ ఏడాది ఎన్నికల్లోనూ ట్రంప్‌నకు కమలా హ్యారీస్ గట్టి పోటీనే ఇచ్చారు. ఎలక్టోరల్ ఓట్లలో వెనుకబడటంతో విజయాన్ని దక్కించుకోలేకపోయారు.

కమలా హ్యారీస్ ఓటమికి కారణాలు..

* డెమొక్రటిక్ అభ్యర్థిగా హ్యారీస్ ట్రంప్‌ను ఓడించేందుకు కొంత ఆలస్యంగా నామినేషన్ వేయడం. దీనివల్ల సొంత పార్టీలో ఆమెకు పెద్దగా ప్రజాదారణ లేకపోవడం, ఎక్కువగా కనిపించని, ప్రజాదరణ లేని ఉపాధ్యక్షురాలు కావడం కూడా ఓటమికి కారణం కావొచ్చు.

* జోన్ బిడెన్ పాలనకు భిన్నంగా ఆమె ప్రభావం చూపలేకపోయారు. ఇది కూడా ఆదరణ పెరగకపోవడానికి కారణం. దాదాపు 36 శాతం అమెరికన్లు ఆమెపై విశ్వాసం చూపలేకపోయారు.

* చట్టవిరుద్ధమైన వలసల గురించి ఆందోళనలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆమెను సరిహద్దు వ్యవహారంలో విఫలమైన వ్యక్తిగా ట్రంప్ విమర్శలు ఎక్కువ ప్రచారంలో ఉండటం

* సాంప్రదాయంగా డెమొక్రాట్ ఓటర్లుగా ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి కూడా ఆమె ఆదరణ పొందలేకపోయారు. దీనికి తోడు బరాక్ ఒబామా నల్లజాతీయులకు మహిళా అధ్యక్షురాలిని చేయాలనే ఆలోచన లేదని చెప్పడం కమలా హ్యారీస్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాకుండా మిచిగాన్‌లో పాలస్తీనియన్‌లకు అనుకూలంగా, పెన్సిల్వేనియాలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా కమలా ప్రకటనలు చేయడం భిన్నాభిప్రాయాల వల్ల ఆమెపై ఓటర్లు నమ్మకం కోల్పోయారు.

* చివరగా, ట్రంప్ గెలిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని డెమొక్రటిక్ పార్టీ ప్రచారాన్ని ఓటర్లు పట్టించుకోలేదు. దీంతో 2024 ఎన్నికల ఓటమిని డెమొక్రటిక్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed