- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉక్రెయిన్‌కు మరోసారి షాకిచ్చిన అమెరికా

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donalrd trump) ఉక్రెయిన్‌కు (Ukraine) మరోసారి షాక్ ఇచ్చాడు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి వైట్‌హౌస్‌లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ చర్చ వాడీవేడిగా సాగటంతో ఇరు దేశాల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐరోపా దేశాలపై ఉన్న ఒత్తిడి రెట్టింపు కానుంది.
కాగా, ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ఆంక్షలు, టారీఫ్‌లు విధిస్తూ పాలనలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు ఓ ప్రకటనలో వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ముందే ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాల విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్‌స్కీపై ఒత్తిడితెచ్చారు. అయితే, మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని, భవిష్యత్తులో రష్యా తమపై దండయాత్ర చేయకుండా హామీ ఇవ్వాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ భేటీ నుంచి అర్థంతరంగా వెళ్లిపోయాడు.
ఇక జర్మన్ పరిశోధన సంస్థ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2022 నుంచి 2024 వరకు ఉక్రెయిన్‌కు అమెరికా 119.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. అదే సమయంలో ఐరోపా దేశాలు 132.3 బిలియన్ యూరోల సాయాన్ని అందించాయి.