‘సెంగోల్’ స్థానంలో రాజ్యాంగం ఉంచాలి

by S Gopi |
‘సెంగోల్’ స్థానంలో రాజ్యాంగం ఉంచాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ 'సెంగోల్ 'ను ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం అప్పట్లో పెద్ద చర్చనీయాంసం అయింది. అయితే, తాజాగా మరోసారి సెంగోల్ వ్యవహారం చర్చకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్కే చౌదరీ సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్ గంజ్ ఎంపీగా ఉన్న ఆర్కే చౌదరీ సెంగోల్ స్థానంలో రాజ్యాంగం ఖచ్చితంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. 'రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యానికి నాంది అయింది. రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి అసలైన చిహ్నం. బీజేపీ ప్రభుత్వం తన చివరి టర్మ్ అధికారంలో స్పీకర్ కుర్చీ పక్కన సెంగోల్‌ను ఉంచింది. సెంగోల్ అనేది తమిళ పదం. దాని అర్థం రాజదండం. రాజుల కాలం తర్వాత మనం స్వతంత్రులం అయ్యామని దానికి మరోక అర్థం ఉంది. దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. రాజదండం ద్వారా కాదని' ఆయన తెలిపారు. యూపీ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ ఎస్పీ 37 సీట్లతో ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ నిలిచింది. సెంగోల్ అంశంపై స్పందించిన ఎస్పీ చీఫ్ అఖిలేస్ యాదవ్.. సెంగోల్ పెట్టిన సమయంలో ప్రధాని దానికి నమస్కరించారు. కానీ, ఇటీవల ప్రమాణస్వీకారం చేసే సమయంలో నమస్కరించడం మర్చిపోయారు. అందుకే మా ఎంపీ ప్రధానికి గుర్తు చేయాలని అనుకున్నారని అనుకుంటున్నాను.

ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలకు బీజేపీ, ఎన్డీఏ కూటమి ఘాటుగా బదులిచ్చింది. సమాజ్‌వాదీ పార్టీకి భారత చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమిళ సంస్కృతి పట్ల ఇండియా కూటమి ద్వేషాన్ని ప్రదర్శిస్తోందని, గతంలో ఎస్పీ రామచరిత మానస్ఐ దాడి చేసిందని, ఇప్పుడు భారత సంస్కృతి దాడి చేస్తోందని యోగి ఆరోపించారు.

సెంగోల్ స్థానంలో రాజ్యాంగం ఉంచాలనే ఎస్పీ ఎంపీ లేఖపై స్పందించిన జూనియర్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్ రాజదండం ప్రతి తమిళుడి గర్వకారణమని అన్నారు. ఇది తిరుక్కురల్(కవి తిరువళ్లువర్ తమిళ కవిత్వం)లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ప్రభుత్వంలో సెంగోల్ పాత్ర గురించి ఆయన రాశారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్, నెహ్రూ అధికారం ఎలా ఉంటుందో చెప్పారని మురుగన్ వివరించారు.

Advertisement

Next Story