ప్రధాని మోడీ ఓబీసీ కాదన్న రాహుల్.. కేంద్రం ‘ఫ్యాక్ట్ చెక్’ ఇదీ

by Hajipasha |   ( Updated:2024-02-08 13:41:49.0  )
ప్రధాని మోడీ ఓబీసీ కాదన్న రాహుల్.. కేంద్రం ‘ఫ్యాక్ట్ చెక్’ ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓబీసీ కాదని.. ప్రధానికి చెందిన ‘తేలి’ కులాన్ని బీజేపీ హయాంలోనే ఓబీసీ జాబితాలో చేర్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హేతుబద్ధంగా స్పందించాయి. రాహుల్ వ్యాఖ్యలపై ఫ్యాక్ట్ చెక్ చేసి వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోద్ ఘాంచీ కులంలోని ఘాంచీ అనే ఉప కులంలో జన్మించారు. ఈ కులం సామాజికంగా, విద్యాపరంగా వెనుబడిన తరగతికి చెందినది. గుజరాత్‌లో ఒక సర్వే తర్వాత మండల్ కమిషన్ ఇండెక్స్ 91(ఏ) కింద బీసీల జాబితాను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించింది. అందులోనే మోద్ ఘాంచీ కులాన్ని చేర్చారు. భారత ప్రభుత్వం గుజరాత్‌కు సంబంధించిన 105 ఓబీసీ కులాల జాబితాలో మోద్ ఘాంచీలను కూడా చేర్చింది’’ అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రధానమంత్రి కులంపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు సంబంధించిన వాస్తవాలు’’ అనే టైటిల్‌తో ఈ ప్రకటనను రిలీజ్ చేసింది.

బీజేపీ రియాక్షన్ ఇదీ..

‘‘ప్రధాని మోడీ జనరల్ కేటగిరీ సామాజిక వర్గంలో జన్మించారు. ఆయన ఓబీసీ కాదు. అందుకే ఆయన దేశంలో కుల గణన జరగడానికి అనుమతించరు’’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను బీజేపీ నేతలు ఖండించారు. ‘‘నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం కావడానికి రెండేళ్ల ముందే.. 1999 అక్టోబరు 27న ఆయన ప్రాతినిధ్యం వహించే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారు. ఆ తేదీన ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా రిలీజైంది’’ అని పేర్కొంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇదే విధమైన సమాచారంతో ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ చేశారు. మోద్ ఘాంచీ కులాన్ని ఓబీసీ జాబితాలో చేరుస్తూ 1999 అక్టోబరు 27న ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ కాపీని తన పోస్టుకు జతపరిచారు.

Advertisement

Next Story