Eknath Shinde: సెటైర్ అర్థమైంది కానీ.. కునాల్ కామ్రా వ్యాఖ్యలపై స్పందించిన షిండే

by Shamantha N |
Eknath Shinde: సెటైర్ అర్థమైంది కానీ.. కునాల్ కామ్రా వ్యాఖ్యలపై స్పందించిన షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో: కునాల్‌ కామ్రా (Kunal Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌ నాథ్‌ షిండే(Eknath Shinde) ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. తనను ఉద్దేశించి కునాల్ కామరా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కునాల్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని.. అయితే దేనికైనా పరిమితి ఉండాలని అన్నారు. "ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయిలోనే విమర్శలు చేయాలి.. సెటైర్ అర్థమవుతోంది. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఇది ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడటానికి 'సుపారీ' (కాంట్రాక్ట్) తీసుకోవడం లాంటిది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి, హోం మంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి’’ అని అన్నారు. అంతేకాకుండా, తన పార్టీ కార్యకర్తలు పాల్పడిన విధ్వంసాన్ని ఖండించారు. తాను విధ్వంసాన్ని సమర్థించనని అన్నారు. కానీ, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్లే ఇది జరిగిందన్నారు. ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి ఘటనలకు తాను మద్దతివ్వనని చెప్పుకొచ్చారు.

కునాల్ కామ్రా

ఇటీవలే ముంబై యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ స్టూడియోలో కునాల్‌ కామ్రా కామెడీ షో నిర్వహించి దాన్ని రికార్డు చేశారు. అందులో షిండేను‘‘గద్దార్‌’’ (ద్రోహి) తో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇది వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్‌ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే, కునాల్ కమ్రామ షిండేకు క్షమాపణలు చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. అయితే, దీనిపైనా కునాల్ స్పందించారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడట్లేదని.. కోర్టు ఆదేశిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు.

Advertisement
Next Story

Most Viewed