Aaditya: రాజకీయాల కోసం సావర్కర్, నెహ్రూలను నిందిచొద్దు.. కాంగ్రెస్, బీజేపీలకు ఆదిత్యథాక్రే సూచన

by vinod kumar |
Aaditya: రాజకీయాల కోసం సావర్కర్, నెహ్రూలను నిందిచొద్దు.. కాంగ్రెస్, బీజేపీలకు ఆదిత్యథాక్రే సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ ప్రయోజనాల కోసం నెహ్రూ (Nehru), సావర్కర్‌ (Savarkar) లను నిందించడం మానుకోవాలని శివసేన(UBT) నేత ఆదిత్య థాక్రే (Aadithya thakraey) కాంగ్రెస్, బీజేపీలకు సూచించారు. రాజ్యాంగంపై జరుగుతున్న చర్చ దేశ భవిష్యత్‌పై దృష్టి సారించేలా ఉండాలన్నారు. శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలు గతంలోకి వెళ్లకుండా భవిష్యత్ గురించి మాత్రమే మాట్లాడాలని నొక్కి చెప్పారు. ‘నెహ్రూను లేదా సావర్కర్‌ను ఇంకా ఎన్ని రోజులు నిందిస్తారు? వారిని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? 50-100 ఏళ్ల క్రితం జరిగిన దానిపై ఎంతకాలం ఆలోచిస్తారు? ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్యలైన ఉపాధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడాలి’ అని వ్యాఖ్యానించారు.

నెహ్రూ, సావర్కర్‌లు చేసిన దానికి బదులు యువతకు ఉపాధి ఎలా కల్పించాలనే దానిపై దృష్టి సారిస్తే బాగుంటుందని తెలిపారు. మహారాష్ట్రలో మహిళలు, యువకులు, సీనియర్ సిటిజన్లు, నిరుద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే ఎటువంటి ప్రయోజనమూ లేదని తెలిపారు. కాగా, రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సావర్కర్ ను నిందిస్తే, మోడీ నెహ్రూపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే థాక్రే స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed