రూ.12 కోట్లు నీటిపాలు.. కాంట్రాక్టర్‌పై తీవ్ర విమర్శలు

by Harish |
రూ.12 కోట్లు నీటిపాలు.. కాంట్రాక్టర్‌పై తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజల ప్రయాణ కష్టాలు మరికొద్ది రోజుల్లో తీరుతాయని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా అది కాస్త తలకిందులు అయింది. బీహార్‌ అరారియా జిల్లాలో కుర్సకాంత - సిక్తి మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు రూ.12 కోట్లతో నిర్మించిన వంతెన మంగళవారం కూలిపోయింది. దీనిని మరికొద్ది ప్రారంభించాల్సి ఉండగా, బాక్రా నదిలో ప్రవాహం భారీగా పెరగడంతో దాని ధాటికి తట్టుకోలేక నీటిలో కుప్పకూలింది. గత కొద్ది రోజులుగా పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా బాక్రా నదికి నీరు పోటెత్తుతోంది.

దీంతో వంతెన మూడు పిల్లర్లు మొదట కుంగిపోయాయి. నీటి ప్రవాహం తగ్గకుండా ఇంకా పెరగడంతో మంగళవారం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంతెన కూలిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడంతో స్థానికులు నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నాసిరకంగా వంతెన నిర్మించడంతో కూలిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మూడేళ్లలో ఇలాంటి ఘటనలు తొమ్మిది

ఇదిలా ఉంటే గతంలో కూడా బీహార్‌లో వంతెనలు కూలిపోయిన ఘటనలు చాలా జరిగాయి. గత మూడేళ్లలో ఇక్కడ తొమ్మిది వంతెనలు కూలిపోయాయి. వీటిలో చాలా వంతెనలు నిర్మాణ సమయంలోనే కూలిపోగా, ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందు కూడా చాలా వరకు కూలిపోయాయి. ఈ ఏడాది మార్చి 22న సుపాల్ పట్టణంలో కోసి నదిపై నిర్మించిన వంతెన కూలిపోవడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. భాగల్‌పూర్‌లో గంగా నదిపై రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన గతేడాది జూన్‌లో కూలిపోయింది.

మార్చి 19, 2023న, సరన్‌లో ఒక వంతెన కూలింది. అదే ఏడాది ఫిబ్రవరి 19న పాట్నాలో నిర్మాణంలో ఉన్న వంతెన నాలుగు లేన్ల రహదారిపై కూలిపోయింది. జనవరి 16, 2023న దర్భంగా జిల్లాలో ఒక వంతెన కూలిపోయింది.18 నవంబర్ 2022న నలందలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోగా ఒకరు మృతి చెందారు. 9 జూన్ 2022న సహర్సాలో వంతెన కూలి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. మే 20, 2022న పాట్నాలో 136 ఏళ్ల నాటి వంతెన పడిపోయింది. ఈ వంతెనను 1884లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు తాజాగా రూ.12 కోట్లతో నిర్మించిన వంతెన నీటి పాలు అయింది.

Advertisement

Next Story