Mumbai: ముంబై వృద్ధురాలిని 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ. 20 కోట్లు మోసం చేసిన స్కామర్లు

by S Gopi |
Mumbai: ముంబై వృద్ధురాలిని డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 20 కోట్లు మోసం చేసిన స్కామర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ ముంబైకి చెందిన 86 ఏళ్ల వృద్ధురాలి నుంచి రెండు నెలల వ్యవధిలో రూ. 20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. స్కామర్లు సీబీఐ అధికారిగా నటించి వృద్ధురాలి సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బు వసూలు చేశారు. 2024, డిసెంబర్ 26 నుంచి మార్చి 3 మధ్యకాలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సీబీఐ అధికారులుగా నమ్మించిన స్కామర్లు బాధితురాలిని ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని చెప్పారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆమెకు కాల్ చేసి ఆమె లొకేషన్ తనిఖీ చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆమె కూతురికి తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీబీఐ అధికారి అని చెప్పిన వ్యక్తి కాల్ చేసి.. మనీలాండరింగ్ కోసం తన ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాను వాడారని చెప్పాడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, గదిలోంచి బయటకు రాకూడదని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఆ వ్యక్తి ఆమెని నమ్మించాడు. ఆమె పిల్లలను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించినట్టు ఆమె ఫిర్యాదులో వివరించింది. ఆమె ప్రవర్తపై పనిమనిషికి సందేహం కలిగింది. ఆ విషయాన్ని ఆమె కుమార్తెకు తెలియజేసింది. నేరపూరిత కార్యకలాపాలతో అనుసంధానం చేసిన ఆమె ఖాతాలోని నిధులను తనిఖీ చేసే నెపంతో మోసగాళ్లు వృద్ధ మహిళ నుంచి ఆమె బ్యాంకు వివరాలను తీసుకున్నారు. కేసు, కోర్టు ఫీజు అంటూ రెండు నెలల వ్యవధిలో ఆమె నుంచి రూ. 20.26 కోట్లు దోపిడీ చేశారు. కేసును దర్యాప్తు చేసే క్రమంలో సైబర్ పోలీసులు డబ్బు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టు కనుగొన్నారు. డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను గుర్తించి మహిళకు చెందిన రూ.77 లక్షలను ఫ్రీజ్ చేసినట్టు సైబర్ పోలీసులు పేర్కొన్నారు.



Next Story