గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి

by John Kora |
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి
X

- రూ.12 కోట్ల విలువైన 14.8 కేజీల గోల్డ్ పట్టివేత

- బెంగళూరు ఎయిర్‌పోర్టులో వలపన్ని పట్టుకున్న డీఆర్ఐ

- కర్ణాటక ఐపీఎస్ అధికారి కుమార్తెగా గుర్తింపు

- రాజకీయంగా దుమారం రేపిన ఘటన

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకొని వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రన్యారావు కన్నడ నటి మాత్రమే కాక.. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్రరావు కూతురు (స్టెప్ డాటర్) కావడం గమనార్హం. కాగా, డీఆర్ఐ అధికారులు కొంత కాలంగా రన్యా రావుపై నిఘా వేసి ఉంచారు. సోమవారం దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో వస్తుందని తెలుసుకున్న అధికారులు ఆమెను చాకచక్యంగా అదుపులోకి తీసున్నారు. తాను ధరించిన బట్టల్లో గోల్డ్ బార్స్ దాచి తీసుకొని వస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల రన్యానావు తన భర్త జతిన్‌తో కలిసి తరచూ యూఏఈకి వెళ్లి వస్తున్నారు. గత 15 రోజుల్లో ఆమె నాలుగు సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. అక్కడ ఆమెకు ఎలాంటి వ్యాపారం, కుటుంబం లేకపోయినా దుబాయ్ వెళ్లిరావడం డీఆర్ఐ అధికారులకు అనుమానాస్పదంగా అనిపించింది. డీఆర్ఐ ప్రోటోకాల్స్ ప్రకారం ఎవరైనా ప్యాసింజర్ పదే పదే విదేశాలకు వెళ్లి వస్తుంటే వారిపై నిఘా వేస్తారు. ఈ క్రమంలోనే రన్యా రావుపై నిఘా పెట్టారు. ఆమె దుబాయ్ వెళ్లి వచ్చినప్పుడల్లా ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ధరించడం గమనించారు. అయితే తన సవతి తండ్రి డీజీపీ కావడంతో పోలీస్ ఎస్కార్ట్‌ను ఉపయోగించుకొని సెక్యూరిటీ చెక్స్‌ను తప్పించుకునేదని గుర్తించారు. సోమవారం కూడా సెక్యూరిటీ చెక్స్‌ను తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు ఎస్కార్ట్‌గా వచ్చిన కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీని తప్పించుకోవాలని భావించింది. అయితే డీఆర్ఐ అధికారులు ఆమెను బంగారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత నాగావరలోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు.

రన్యా రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడింది. మొత్తంగా రన్యా రావు నుంచి దరూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14.2 కిలోల బంగారాన్ని ఒకే వ్యక్తి దగ్గర నుంచి సీజ్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలి సారని డీఆర్ఐ అధికారులు ప్రకటించారు. కాగా, తనను కొంత మంది బ్లాక్ మెయిల్ చేసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయించారని రన్యారావు అధికారుల విచారణలో తెలిపింది. కానిస్టేబుల్ బసవరాజు స్టేట్మెంట్‌ను కూడా అధికారులు రికార్డు చేశారు. ఈ బంగారం స్మగ్లింగ్‌ రన్యారావు ఒక్కరే నిర్వహిస్తున్నారా? లేదంటే దీని వెనుక పెద్ద ముఠా ఏదైనా ఉందా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ బంగారం స్మగ్లింగ్‌పై స్పందించడానికి కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర నిరాకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని.. పూర్తి నిజాలు వెల్లడయ్యే వరకు తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. పోలీసులు తమ పని తాము చేస్తున్నారని అన్నారు. తూంకూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్ ఈ స్మగ్లింగ్ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపన్న కుటుంబానికి చెందిన వాళ్లు ఎందుకు ఇలాంటి వాటిలో చిక్కుకుంటారో అర్థం కావట్లేదని అన్నారు. శివాజీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. ఈ స్మగ్లింగ్ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఐపీఎస్ కూతురుందా? సామాన్యుడి కూతురుందా అని చూడకుండా నిజాలు వెలుగులోకి తేవాలని కోరారు.

Next Story